సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నమో (నరేంద్ర మోడీ) సభకు నగరంలోని ప్యాలెస్ మైదానం ముస్తాబైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 స్థానాల్లో మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్రంలో మోడీ ప్రభావం ఉందనే అంచనాల నేపథ్యంలో ఈ సభపై పార్టీ నాయకులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. సభను సజావుగా, సాఫీగా నిర్వహించడానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. రెండు వారాల కిందటే సభా వేదిక నిర్మాణం, ఇతర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మోడీ హెచ్‌ఏఎల్ విమానాశ్రయం ద్వారా 11 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారు.
అభిమానులకు ఉప్మా, మైసూరు పాక్
ఆహూతుల కోసం ఏర్పాటు చేసిన ఆరు అతి పెద్ద వంట శాలల వద్ద 50 చొప్పున కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సుమారు యాభై వేల మందికి ఆహార పదార్థాలను అందిస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం వడ్డించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచే అల్పాహారం పంపిణీ ప్రారంభమవుతుంది. బెంగళూరు, తుమకూరుకు చెందిన పాక శాస్త్ర నిపుణులు చవులూరించే వంటకాలను సిద్ధం చేయనున్నారు.
సుమారు 1000 మంది వాలంటీర్లు వీటిని పార్టీ అభిమానులకు పంచి పెడతారు. ఇప్పటికే 12 లక్షల నీటి ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఉప్మా, మైసూర్ పాక్, పలావ్, టొమాటో రైస్ బాత్‌లను అభిమానులకు పంపిణీ చేస్తారు. కాగా బహిరంగ సభను పురస్కరించుకుని ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బళ్లారి రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. పలు రూట్లలో మార్పులు చేశారు.
నమో సభకు సర్వం సిద్ధం
Published Sun, Nov 17 2013 3:37 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement