పింప్రి, న్యూస్‌లైన్: మూఢనమ్మకాలు, దురాచారాల నిర్మూలనకు రాజీలేని పోరాటం చేసిన ప్రముఖ హేతువాది, వైద్యుడు, జర్నలిస్టు నరేంద్ర దబోల్కర్(69)ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. అంధశ్రద్ధ నిర్మూలన సమితి సంస్థాపక కార్యాధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న ఆయనను మంగళవారం ఉదయం కాల్చిచంపారు. పుణేలోని ఓంకారేశ్వర్ దేవాలయ సమీపాన ఉన్న వంతెనపై ఉదయం 7.30 గంటలకు మార్నింగ్‌వాక్ చేసి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి నరేంద్ర తలపై కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న తాము దబోల్కర్‌ను ససూన్ ఆస్పత్రికి తరలించామని, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని సాక్ష్యాధారాలు లభించాయని పుణే కమిషనర్ గులాబ్‌రావు పోల్ తెలిపారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక పోలీసుల బృందాన్ని నియమించారు.
మూడు సంవత్సరాల క్రితం దబోల్కర్ అంధశ్రద్ధ నిర్మూలన్ సమితిలోని కీలక పదవులకు రాజీనామా చేసి సమితికి మార్గదర్శనం చేస్తున్నారు. ఆయన 16 సంవత్సరాలుగా ‘సాధన’ మాస పత్రికకు సంపాదకుడిగా పని చేస్తున్నారు. హేతువాదంపై పలు పుస్తకాలు కూడా రాశారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ దబోల్కర్ హత్యను తీవ్రంగా ఖండించారు. రాజకీయ పార్టీలు బుధవారం పుణే నగర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆటోలు కూడా నడపకూడదని ఆటోవాలాలు నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..
సాక్షి, ముంబై: దబోల్కర్ హత్యను నిరసిస్తూ ముంబైలోని అంబేద్కర్, వామపక్షవాద సంస్థలతోపాటు తెలంగాణ సంఘీభావ వేదిక, శ్రమజీవి సంఘాలు మంగళవారం ర్యాలీ నిర్వహించాయి. దాదర్‌లోని ప్లాజా నుంచి శివాజీ నాట్యమందిర్ మీదుగా చైత్య భూమి వరకు ర్యాలీ కొనసాగింది. మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా జీవితాంతం విరామం లేకుండా పోరాడిన మహావ్యక్తంటూ నాయకులు కొనియాడారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాజుకదమ్, గ్యార శేఖర్, శ్యామ్ సోనార్, అశోక్ జాదవ్‌తోపాటు ప్రముఖ రచయితలు పుష్పాభావే, ఆశాలత కాంబ్లే, దినపత్రికల సంపాదకులు (లోక్‌సత్తా) లాల్ నిషాస్, విజయ కులకర్ణి, శ్రమజీవి నాయకులు గొండ్యాల రమేష్, తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
భారిఫ్ బహుజన్ మహాసంఘ్ ఆధ్వర్యంలో
భారిఫ్ బహుజన్ మహాసంఘ్ నాయకులు దాదర్‌లోని శివాజీ మందిరం నుంచి చైత్యభూమి దాకా నిరసన ప్రదర్శన నిర్వహించారు. తర్వాత చైత్యభూమి వద్ద భారీసభను ఏర్పాటు చేశారు. మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు ప్రకాష్ అంబేద్కర్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దుర్మార్గపు వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని హత మార్చడం పరిపాయిందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాలని హెచ్చరించారు. హంతకులను తక్షణమే పట్టుకొని కఠిన శిక్ష విధించాలన్నారు. దబోల్కర్ ప్రతిపాధించిన అంధశ్రద్ధ నిర్మూలన చట్టాన్ని అసెంబ్లీలో వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహాసంఘ్ నాయకులు అశోక్ పద్మశాలి, జి.శంకర్ మాల, నాగ్‌సేన్ మాల తదితరులు పాల్గొన్నారు.
నరేంద్ర దబోల్కర్ హత్య
Published Wed, Aug 21 2013 2:16 AM | Last Updated on Mon, Oct 8 2018 4:55 PM
Advertisement
Advertisement