అనుష్క నా కూతురులాంటిది
చెన్నై : నటి అనుష్క నా కూతురులాంటిదని నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ వ్యాఖ్యానించారు. ఆర్య, అనుష్క జంటగా నటించిన తాజా చిత్రం ఇంజి ఇడుప్పళగి, తెలుగులో జీరో సైజ్ పేరుతో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని పీవీపీ సినిమా నిర్మించింది. కేఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మరగథమణి(కీరవాణి) సంగీతాన్ని అందించారు.
చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక అన్నాసలైలోని సత్యం సినీ థియేటర్‌లో జరిగింది. చిత్ర ఆడియోను నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఆవిష్కరించి ఇతర ముఖ్య అతిథులకు చిత్ర యూనిట్‌కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది సంగీత దర్శకుడు మరగథమణి వేడుక రోజు అన్నారు.
ఆయన ఇళయరాజాకు ధీటుగా సంగీతాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. అందుకు బాహుబలిలాంటి పలు చిత్రాలే సాక్ష్యంగా పేర్కొన్నారు. సొంత గుర్తింపు కోసం పోరాడుతున్న ఈ చిత్ర దర్శకుడు కేఎస్ ప్రకాశరావు తనకు నటుడిగానే పరిచయం అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఒక ఆంగ్ల చిత్రంలో తాను నటించానని తెలిపారు. ప్రకాశరావు ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు కొడుకనే గుర్తింపు ఉన్నా తన కంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఆయన తపన పడుతున్నారని... అది ఈ చిత్రంతో లభిస్తుందని భావిస్తున్నానని అన్నారు.
ఆర్య అమ్మాయిలతోనే మాట్లాడుతారు: ఈ చిత్ర కథా నాయకుడు ఆర్య గురించి చెప్పాలంటే తాను హీరోయిన్లతోనే ఎక్కువగా మాట్లాడుతారని చాలామంది అనుకుంటారని, ఆయనతో తాను మూడు చిత్రాలలో నటించానని చెప్పారు. ఆర్య అందరితోను సరదాగా మాట్లాడుతారని,తనతో ఎంతసేపు ఆయన మాట్లాడవచ్చునని అన్నారు. కథ తన చుట్టూనే తిరగాలి, పోరాట సన్నివేశాలు ఉండాలని కాకుండా మంచి కథా పాత్రలు ఎంచుకుంటూ నటిస్తున్న ఆర్యను అభినందించాలి అన్నారు.
నడిగర్ సంఘం అధ్యక్షుడిగా రాలేదు: తానీ కార్యక్రమానికి ఒక నటుడిగానో, లేక దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడిగానో రాలేదన్నారు. తన కూతురు అనుష్క ఒక వైవిధ్య భరిత పాత్రలో నటించారనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని అన్నారు. ఇందులో నటించే ముందు అనుష్క ఈ చిత్ర కథను తనకు చెప్పిందని ఇలాంటి పాత్రలో నటించనున్నానని చెప్పగానే చాలా సంతోషం కలిగిందన్నారు. చిత్ర ఖర్చుకు తగ్గ హాలీవుడ్, లేదా బాలీవుడ్ మేకప్ నిపుణుడిని నటుడు కమలహాసన్ సలహా తీసుకుని తెలియజేస్తానని చెప్పానన్నారు.
అందుకామె లేదు సార్ తాను పాత్రకు తగ్గట్టుగా బరువు పెంచి నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పారన్నారు. ఈ చిత్రంలో బరువు పెంచి నటించినా అనుష్క అందంగానే ఉన్నారని నాజర్ అన్నారు. ఇంజి ఇడుప్పళగి ఒక సాధారణ చిత్రంలా కాకుండా వినూత్నంగా చక్కని హాస్యం మేళవించిన చిత్రంగా ఉంటుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అనుష్క, ఆర్య, మరగథమణి, చిత్ర దర్శకుడు కేఎస్ ప్రకాశరావులతో పాటు పలువురి సినీ ప్రముఖులు పాల్గొన్నారు.