
ఏమీ తెలియని వాళ్ళు చిత్రాలు తీస్తున్నారు
ఇప్పుడు సినిమా గురించి తెలియని వాళ్ళు కూడా చిత్రాలు తీస్తున్నారని సీనియర్ దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషలలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నయాప్పుడై.
ఆయనతోపాటు గీత రచయిత పా.విజయ్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. నవ దర్శకుడు విజయ్‌కిరణ్ పరిచయం అవుతున్నా ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. చిత్ర ఆడియోను నటుడు ఆర్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర ప్రధాన పాత్రదారుడు ఎస్‌ఏ. చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు శ్రమించిడం తప్ప మరేమీ తెలియదన్నారు.
ఎవరైనా మనల్ని ఇష్టపడితే వారు మనల్ని వదలిపోరన్నారు. తాను ఐదు ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు గుర్తు చేశారు. నిజంగా ప్రేమించిన వాళ్లు మనల్ని వదిలిపోలేరని అన్నారు. అలాంటిది ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమ కనిపించడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన భార్య తరువాత తాను అంతగా ప్రేమించేది సినిమానేనని అన్నారు. ప్రేమకు ఎప్పుడూ ప్రత్యేక శక్తి ఉంటుందన్నారు.
అందుకే ఇక సినిమా వద్దు అని నిర్ణయించుకున్నా తనను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పారు. ఇకపోతే ఇప్పుడు సినిమా గురించి తెలియకుండానే, కథ లేకుండానే చిత్రాలు చేస్తున్నారనీ ఈ తరం వారికి చురకలు వేశారు.తన వయసు 73 ఏళ్లు అనీ,ఈ నయాప్పుడై 17 ఏళ్ల యువకుడు దర్శకత్వం వహిస్తున్నారనీ పేర్కొన్నారు. తొలి రోజునే ఆయన దర్శకత్వం తీరు సంతృప్తి అనిపించక పోవ డంతో రెండు రోజులు చేసి మానేద్దాం అనుకున్నాననీ, చిత్రాన్ని నిలిపివేయమని నిర్మాత థానుకు చెప్పాననీ అన్నారు.
ఆయన తనకు నచ్చజెప్పడంతో కాదనలేకపోయానన్నారు. అలాంటిది నాలుగు రోజల చిత్రీకరణను ఎడిట్ చేసి చూపించగా ఆశ్చర్యపోయానని అన్నారు. ఆ తరువాత దర్శకుడు కూర్చోమంటే కూర్చున్నా, నిలబడమంటే నిలబడ్డానని తెలిపారు.ఈ తరం దర్శకుల వద్ద తమలాంటి వారు నేర్చుకోవలసింది చాలా ఉందని ఎస్‌ఏ.చంద్రశేఖర్ అన్నారు.