
పీఠం ఎవరిదో?
* కరుణకే పట్టం ఖాయమని
* ఎన్‌డీటీవీ సర్వే
* అన్నాడీఎంకేదే అధికారమని మరో తమిళ చానల్ స్పష్టీకరణ
* సర్వే ఫలితాలతో పార్టీలు, ప్రజలు సతమతం
చెన్నై, సాక్షి ప్రతినిధిః అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎవరిది. డీఎంకే కాదు అన్నాడీఎంకే అనే వాదన కొనసాగుతున్న తరుణంలో రెండింటికీ అవకాశం ఉన్నట్లుగా రెండు సర్వేలు తేల్చేశాయి. డీఎంకే దే అధికారమని ఎన్‌డీటీవీ, అన్నాడీఎంకేనే మళ్లీ గెలుస్తుందని ఓ ప్రముఖ తమిళచానల్ సోమవారం ప్రకటించడంతో పార్టీలు, ప్రజలు సర్వేలతో సతమతం అవుతున్నారు.
తమిళనాడులో 1994 నుంచి ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఓట్లు సుమారు 10 శాతం వరకు తగ్గిపోవడం పరిపాటిగా మారింది. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార అన్నాడీఎంకే ఓట్లు శాతం తగ్గినట్లు తేలుతుండగా ఈలెక్కన ఆ పార్టీకి 70 సీట్లు మాత్రమే దక్కేఅవకాశం ఉంది. డీఎంకే-కాంగ్రెస్ కూటమి 143 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని ఎన్‌డీటీవీ ఎగ్జిట్‌పోల్ సర్వే చెబుతోంది.
2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి రాగా, ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఆ పార్టీని నియంత్రించాలని విపక్షాలన్నీ పట్టుదలతో ఉన్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, ప్రజాసంక్షేమ కూటమి, బీజేపీలతో పంచముఖ పోటీ నెలకుని ఉంది. అయితే ప్రధాన పోటీ మాత్రం డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యనే అనేది నిర్వివాదాంశం. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేది జయలలితా లేదా కరుణానిధినా అనేది అందరిలోనూ ఉత్కంఠంగా ఉంది. సహజంగా ప్రతిఎన్నికల్లో అధికార పార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. అలాంటి వ్యతిరేకతను ముఖ్యమంత్రి జయలలిత సైతం ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వమే మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం తీవ్ర వ్యతిరేతకు దారితీయగా, ప్రతిపక్షాలకు సైతం అదే ప్రధాన అస్త్రంగా మారింది. అధికారంలోకి వస్తే మద్యనిషేధంపైనే తొలి సంతకమని డీఎంకే, దశలవారీ మధ్య నిషేధమని అన్నాడీఎంకే హామీ ఇచ్చాయి. పోటీలో ఉన్న అన్నిపార్టీలు మద్యనిషేధాన్ని వంత పాడుతున్నాయి. అన్ని ప్రాంతీయ పార్టీలతోపాటూ బీజేపీ సైతం ప్రచార వేగాన్ని పెంచింది. దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేయడం ద్వారా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు సాధించాలని బీజేపీ పెద్దలు సైతం పట్టుదలతో ఉన్నారు.
ద్రవిడపార్టీలలు అధికారంలోకి వస్తే రాష్ట్ర నాశనం తప్పదని బీజేపీ తన ప్రచారంలో హెచ్చరిస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ముఖ్యమంత్రి అభ్యర్దులుగా నలుగురు రంగంలో ఉన్నారు. జయలలిత, కరుణానిధి, విజయకాంత్, అన్బుమణి ఎవరికివారు తామే సీఎం అనే ధీమాతో వ్యవహరిస్తున్నారు.
డీఎంకేదే అధికారమన్న ఎన్‌డీటీవీ
ఈనెల 16వ తేదీన పోలింగ్ జరుగనుండగా అన్నిపార్టీల్లోనూ, ప్రజల్లోను ఫలితాలపై ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో ఎన్‌డీటీవీ వారు తమిళనాడులో సర్వే నిర్వహించారు. ప్రజలు ఏపార్టీకి అనుకూలంగా ఉన్నారనే అంశంపై అభిప్రాయసేకరణ చేసింది. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు సాధించిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే అన్నాడీఎంకే 38 నుంచి 44 శాతంగా, సగటున 42 శాతంతో అధికారాన్ని చేపట్టింది. డీఎంకే 31శాతం వచ్చింది. అంటే అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య కేవలం 19.5 శాతం మాత్రమే వ్యత్యాసమని సర్వేలో పేర్కొన్నారు.
19.5 వ్యత్యాసం వల్ల గత ఎన్నికల్లో డీఎంకేకు 46 సీట్లు రావాల్సి ఉంది. అయితే అధికార పార్టీకి ప్రతి ఎన్నికల్లో తగ్గుతున్న ఓట్ల శాతం ప్రభావం డీఎంకేపై పడి నష్టపోయింది. ఇదే ప్రాతిపదికన ప్రస్తుత ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షంగా అన్నాడీఎంకే, డీఎంకేలు ఒకరి స్థానంలోకి మరొకరు వచ్చి ఉండగా, డీఎంకేకు 3 శాతం ఓట్లు పెరిగితే 62 స్థానాలు దక్కుతాయి. అంతేగాక అధికార అన్నాడీఎంకేపై ఉన్న వ్యతిరేకతతో మరో 5.75 శాతం ఓట్లు డీఎంకేలో కలిసే పరిస్థితులు నెలకొని ఉండగా 120 సీట్లతో కరుణకు పట్టం ఖాయమని అంటోంది.
అదే 7 శాతం వ్యతిరేకత కనబరిస్తే 143 సీట్లను డీఎంకే సొంతం చేసుకుంటుందని సర్వేలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే కేవలం 70 సీట్లతో సరిపెట్టుకోక తప్పదని అంటున్నారు. సహజంగా ఇతర రాష్ట్రాల్లో అధికారపార్టీ ఓటు బ్యాంకులో 7 శాతం వరకు మార్పుచోటుచేసుకోదని సర్వే అభిప్రాయపడింది. 1984 నుండి తమిళనాడులో 7 నుంచి 10 శాతం ఓట్లు అధికార పార్టీలు చేజార్చుకుంటున్నాయని పేర్కొంది.
1989 నుంచి అన్నాడీఎంకే, డీఎంకేలు ఒకటి తరువాత ఒకటి అధికారాని చేపడుతున్నాయి. ఈ మార్పుకు సదరు పదిశాతం ఓట్లే ప్రభావం చూపుతున్నాయని సర్వే అంటోంది. అదే పద్దతి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కొనసాగే అవకాశం ఉన్నందున డీఎంకేకు అధికారం ఖాయమని వివరించింది. డీఎంకే అధికారంలో వస్తుందన్న సర్వేతో ఆ పార్టీ నేతలు ఖుషీ ఖుషీగా ఉన్నారు. అయితే వారి సంతోషాన్ని మరోటీవీ నీరుగార్చింది.
తమిళటీవీ సర్వేలో అమ్మకే అధికారం..
ఇదిలా ఉండగా, తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ తమిళ చానల్ నిర్వహించిన సర్వే ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సుమారు 8 శాతం ఓట్ల తేడాతో అన్నాడీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ప్రకటించింది. అన్నాడీఎంకే-39.66, డీఎంకే-31.89, ప్రజాసంక్షేమ కూటమి-8.59, పీఎంకే-5.03, నామ్ తమిళర్ కట్చి-2.40 శాతం ఓట్లు దక్కించుకుంటాయని తమిళ చానల్ సర్వే చెబుతోంది.