సాక్షి, ముంబై: సర్కారీ బడుల్లో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న అనేక మంది ఉపాధ్యాయులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రత్యేక శిక్షణ తరగతులు ఇవ్వనున్నారు. గణితం, సామాజిక శాస్త్రం, ఆంగ్లములతో పాటు వివిధ సబ్జెక్ట్‌ల్లో వెనుకబడిన గురువులకు ఆయా అంశాలపై పట్టు సాధించే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎంఎస్‌సీఈఆర్‌టీ) డెరైక్టర్ ఎన్.కె.జరగ్ తెలిపారు. వీరికి ఇక్కడ అన్ని విషయాలపై సమగ్ర పట్టు సాధించిన తర్వాత తరగతి గదుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తారని చెప్పారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు తయారవుతారని తెలిపారు.
స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యను బోధించే ఉపాధ్యాయులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. దీనికి ప్రభుత్వం అనుమతినిస్తే తొలిసారి శిక్షణ శిబిరాలు నిర్వహించినట్టువుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో వారివారి సబ్జెక్ట్‌లపై లోతైన అవగాహన లేకపోవడంతో విద్యార్థులు కూడా అలానే తయారవుతున్నారనే విషయాన్ని ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించి తమ దృష్టికి తీసుకువచ్చిందని వెల్లడించారు. ఈ శిక్షణ తొలి విడతలో ఉపాధ్యాయులు ఎలా అభివృద్ధి చెందాలో సూచించనున్నారు. ఉపాధ్యాయులకు బోధనా పద్ధతులు, సబ్జెక్టును ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై నిపుణులు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు శిక్షణ పొందిన అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సి ఉంటుందన్నారు.
ఇదిలాఉండగా 2012లో ఏఎస్‌ఈఆర్ అందించిన నివేదిక ప్రకారం...రాష్ట్రవ్యాప్తంగా ఐదో తరగతి చదువుతున్న 78.8 శాతం మంది విద్యార్థులు ఆంగ్లంలోని సాధారణ వాక్యాలు చదువలేకపోతున్నారు. 77.4 శాతం మంది విద్యార్థులు రెండో తరగతిలోని గణితానికి సంబంధించిన విభజన చేయడంలో విఫలమవుతున్నారు. ఏడో తరగతి చదువుతున్న 64.4 శాతం మంది విద్యార్థులు 1 నుంచి 99 వరకు అంకెలను గుర్తించలేకపోతున్నారు. 16.8 శాతం మంది విద్యార్థులు మూడో తరగతి పాఠ్యపుస్తకాలను చదవలేకపోతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని సంబంధిత అధికారి తెలిపారు.
ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం
Published Mon, Sep 30 2013 11:24 PM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement