ఉద్యోగులతో కళకళలాడిన సచివాలయం
ఉద్యోగులతో కళకళలాడిన సచివాలయం
Published Mon, Oct 3 2016 7:46 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
- 30 శాఖల ఉద్యోగులు రాక
- స్వాగతం పలికిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు
- దారివెంట పలు చోట్ల ఉద్యోగులకు స్కూలు పిల్లల స్వాగతం
- ప్రెస్ వాహనాలు సచివాలయంలోపలికి అనుమతించని పోలీసులు
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగులతో వెలగపూడిలోని నూతన తాత్కాలిక సచివాలయం సోమవారం కళకళలాడింది. ఉదయం నుంచి ఉద్యోగులు డిపార్టుమెంట్స్ వారీగా సచివాలయానికి వచ్చారు. మొత్తం 33 ప్రభుత్వ శాఖలు ఉండగా అందులో 30 శాఖలు ఈరోజు నూతన సచివాలయంలో అడుగుపెట్టాయి. వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖలు రాలేదు. ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు తమ చాంబర్‌లలో కాలుమోపారు. కొందరు సీట్లలో కూర్చోగా మరికొందరు కార్యాలయాలు పరిశీలించి సరిపెట్టారు. కొన్ని చోట్ల పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్న కంప్యూటర్ల బిగింపు ఇంకా పూర్తి కాలేదు. దీంతో చాలా మంది ఉద్యోగులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులకు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్ నుంచి వెలగపూడికి వస్తున్న ఉద్యోగులకు దారి మధ్యలో ఉండే స్కూళ్ళ విద్యార్థినీ విద్యార్థులు ప్లేకార్డులు పట్టుకొని వెల్‌కం చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్‌లు సచివాలయానికి వచ్చారు. యనమల రామకష్ణుడు తమ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఎంతమంది వచ్చారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. మొత్తం సచివాలయ ఉద్యోగులు సుమారు 1500 మంది వరకు సోమవారం సచివాలయానికి చేరుకున్నారు.
మంత్రులు ఒకచోట... కార్యదర్శులు మరోచోట...
మొత్తం ఐదు బ్లాక్‌లు సచివాలయానికి నిర్మించారు. ఒక్కోబ్లాక్ విడివిడిగా ఉన్నాయి. ఒక బ్లాక్‌లో నుంచి మరో బ్లాక్‌కు నడిచి వెళ్ళాలంటే కనీసం పావుగంట పడుతుంది. ఒక బ్లాక్‌లో మంత్రి పేషీ ఉంటే మరో బ్లాక్‌లో కార్యదర్శి కార్యాలయం ఉంది. ఉద్యోగుల మరోచోట ఉన్నారు. ఇలా ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఉండటంతో వీటిని సరిచేసే కార్యక్రమంలో కన్‌స్ట్రక్షన్ వింగ్ నిమగ్నమైంది. మంత్రి పేషీ వద్దే సెక్రటరీ చాంబర్ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో మార్పులకు శ్రీకారం చుట్టారు.
పోలీసుల ఆంక్షలు
పోలీసులు విజయవాడ నుంచి వెలగపూడి సచివాలయం వరకు రోడ్డు వెంట ఉన్నారు. వెంకటపాలెం, మందడంలో పోలీసుల ఆంక్షలకు స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. మందడంలో కొందరు ప్రజలు పోలీసు చర్యలు నిరసిస్తూ ఆందోళనకు దిగారు. తర్వాత పోలీసులు వారికి సర్థిచెప్పారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు చెందిన జర్నలిస్ట్‌ల వాహనాలు లోపలికి అనుమతించలేదు. హైదరాబాద్‌లోనే వాహనాలు లోపలికి అనుమతిస్తున్నారని అడిగినా వారు పట్టించుకోలేదు. కాంపౌండ్‌వాల్ బయటనే వాహనాలు ఆపి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ప్రధాన ద్వారం వద్ద చెక్‌చేసి పంపించినా లోపల ప్రతి బ్లాక్‌లోనూ పోలీసులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగులు సైతం పోలీసుల బారిన పడక తప్పలేదు. ఐడీ కార్డులు చూపించినా పలు ప్రశ్నలు వేస్తూ కనిపించారు. మంత్రులకు, కొంతమంది ఉన్నతాధికారులకు సెక్యూరిటీ ఉన్న వారు కాస్త హడావుడి చేశారు.
భోజన ఏర్పాట్లు
సీఆర్‌డీఏ వారు ఉద్యోగులకు భోజన ఏర్పాట్లు చేశారు. అయితే భోజనం అందరికీ సరిపోదని, అక్కడ ఎక్కువ మంది జనం ఉన్నారని భావించిన కొన్ని శాఖల వారు నేరుగా భోజనం తెప్పించుకున్నారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఈ ఏర్పాట్లు పరిశీలించారు. ఉద్యోగులతో కలివిడిగా తిరిగారు.
మీడియాతో మాట్లాడిన పత్తిపాటి
వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు కాసేపు మీడియాతో మాట్లాడారు. సచివాలయ విషయం వదిలిపెట్టి రుణమాఫీ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిలు రాజకీయాలు చేస్తున్నారని, తాము రైతు రుణాలు రద్దు చేసినా చేయలేదని రైతులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Advertisement