ఎన్‌డీఎంసీకి శతవసంతాలు
Published Mon, Dec 23 2013 12:55 AM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌కు (ఎన్‌డీఎంసీ) సోమవారంతో నూరేళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సంస్థ శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆధునీకరించిన కన్నాట్‌ప్లేస్ మార్కెట్‌ను పునఃప్రారంభించడంతోపాటు షాపింగ్, ఆహార ఉత్సవాలు నిర్వహిస్తారు. కన్నాట్‌ప్లేస్ ఆధునీకరణ పనులను పూర్తి చేయడానికి విధించుకున్న తుదిగడువులు ఇది వరకే పలుసార్లు మీరిపోయినా, ఈసారి మాత్రం విజయవంతంగా పూర్తి చేయగలిగారు. ఎన్నో ఆకాశహర్మ్యాలు, షాపింగ్‌సెంటర్లకు నిలయమైన కన్నాట్‌ప్లేస్ మార్కెట్‌ను ఈ నెల 30న లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ ప్రాంత ప్రజల వినోదం కోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎన్‌డీఎంసీ చైర్‌పర్సన్ జలజ్ శ్రీవాత్సవ తెలిపారు.
నగరం నడిబొడ్డున ఉండే కన్నాట్‌ప్లేస్ షాపింగ్, ఆహార ఉత్సవం, సంగీత విభావరి నిర్వహిస్తామని ప్రకటించారు. న్యూఢిల్లీ వ్యాపారుల సంఘం సహకారంతో సోమవారం నుంచి రెండువారాలపాటు షాపింగ్ ఉత్సవం నిర్వహిస్తామని వివరించారు. వినియోగదారులకు ఇందులో ఆఫ ర్లు, రాయితీలు లభిస్తాయని ఎన్‌డీఎంసీ వర్గాలు తెలిపాయి. దీనికితోడు ఎన్‌డీఎంసీ సమావేశమంది రంలో ఈ నెల 27న చలనచిత్రాల ప్రదర్శన కూడా నిర్వహిస్తారు. వివిధ రాష్ట్రాల వంటకాలు అందుబాటులో ఉండే ఫుడ్ ఫెస్టివల్ 23 నుంచి 29 తేదీ వరకు కొనసాగుతుంది. పాతకార్ల ర్యాలీని 29న, రెండు రోజుల తరువాత పతంగుల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఎబిలిటీ అన్‌లిమిటెడ్ బృందం సంగీత విభావరిని జనవరి 2,3 తేదీల్లో ఆస్వాదించవచ్చు.
కన్నాట్‌ప్లేస్ మార్కెట్ ప్రారంభోత్సవంలోనూ ప్రముఖ కళాకారులు, గాయకులతో ప్రదర్శనలు ఉంటాయి. సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్‌తో ప్రదర్శన నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎన్‌డీఎంసీ అదికారి ఒకరు తెలిపారు. కన్నాట్‌ప్లేస్ పునరాభివృద్ధి దాదాపు పూర్తయిందని, కొన్ని ప్రాథమిక నిర్వహణ పనులను త్వరలోనే పూర్తిగా చేస్తామని వివరణ ఇచ్చారు. దీనికి కన్సల్టెంటుగా వ్యవహరించిన ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) నుంచి పనులు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌డీఎంసీ ప్రకటించినప్పటికీ, ఈఐఎల్ ఇప్పటికీ మరమ్మతులు నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ మార్కెట్ నిర్వహణను చూసేందుకు ఎన్‌డీఎంసీ ఇటీవలే హౌస్‌కీపింగ్ టెండర్లనూ ఆహ్వానించింది.
అయితే మార్కెట్ ప్రారంభోత్సవానికి పిలవాల్సిన ముఖ్య అతిథిని ఎన్‌డీఎంసీ ఇంకా ఎంపిక చేయలేదు. ఈ నెల 30న నిర్వహించే కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను ఆహ్వానించాలని అధికారులు భావిస్తున్నారు. న్యూఢిల్లీ, ఢిల్లీ కంటోన్మెంట్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, సురిందర్ సింగ్‌ను ఆహ్వానించేది లేనిదీ ఎన్‌డీఎంసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్యేలను తమ కౌన్సిల్ సభ్యులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎన్‌డీఎంసీ కేంద్ర హోంశాఖను కోరినా దాని నుంచి ఇంకా స్పందన రాలేదు. ఇక ఈ శతాబ్ది ఉత్సవాల్లో ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ (డీటీటీడీసీ) కూడా పాలుపంచుకుంటోంది.
Advertisement
Advertisement