ఇక కొత్త ఓటరు కార్డులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: కొత్తగా ఓటర్ల జాబితాలో చేరిన 12 లక్షల మందికి సెప్టెంబరు మూడో వారంలో గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో బ్లాక్ అండ్ వెట్‌లో ఓటరు గుర్తింపు కార్డులు చెలామణిలో ఉన్నాయని, వీటి స్థానంలో కలర్ ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను అందజేయాలని గత ఏడాది నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం కలర్ గుర్తింపు కార్డులు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఓటర్ల నమోదుకు ఈ ఏడాది మార్చి 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించగా ఆరోజున 10 లక్షల మంది, ఆ తరువాత ఎన్నికలకు ముందు మరో 2 లక్షల మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇలా కొత్తగా నమోదు చేసుకున్న 12 లక్షల మందికి ముందుగా కలర్ గుర్తింపు కార్డులు జారీ చేస్తామని, ఆ తరువాత మిగిలిన వారికి జారీ చేస్తామని తెలిపారు. నకిలీ కార్డులను నిరోధించేందుకు పాస్‌వర్డ్ నెంబరును జత చేసి కొత్తకార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు. కాలేజీ విద్యార్థులను ఓటర్ల జాబితాల్లో చేర్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,100 కళాశాలల్లోని విద్యార్థులనే ఎన్నికల ప్రత్యేక దూతలుగా నియమించినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ బాధ్యతల్లో ఉన్న విద్యార్థులు మూడో ఏడాది చదువును ముగించుకుని వెళ్లిపోయినందున కొత్తవారిని నియమించాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు.
నగరాల్లోని ఒక బూత్ పరిధిలో 1,400, గ్రామాల్లోని ఒక బూత్ పరిధిలో 1,200 ఓటర్ల సంఖ్య దాటినట్లయితే అదనపు బూత్‌లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని అన్నారు. అదనపు బూత్‌లకు సంబంధించి జిల్లా కలెక్టర్ల నుంచి ప్రతిపాదనలు సైతం తమకు అందాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60,847 పోలింగ్ బూత్‌లు ఉండగా కొత్త ప్రతిపాదనల వల్ల 5 శాతం నుంచి 10 శాతం వరకు పోలింగ్‌బూత్‌లు పెరిగే అవకాశం ఉందని ఆయన వివరించారు.
వందమంది అభ్యర్థులకు ఈసీ నోటీసులు
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వంద మంది అభ్యర్థులకు నోటీసులు పంపినట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 845 మంది అభ్యర్థుల్లో 750 మంది తమ ఖర్చుల వివరాలను ఈసీకి సమర్పించారని తెలిపారు. వాటిని పరిశీలించిన పిదప కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి పంపామని తెలిపారు. లెక్కలు సమర్పించని, సమర్పించిన వారిలో తప్పుడు సమాచారం ఇచ్చిన వందమందికి సీఈసీ నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు.