లెక్క తేలుతోంది
Published Wed, Feb 8 2017 4:04 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
బయటపడుతున్న భూబాగోతం
నిడగల్లులోని 10.90ఎకరాల గుట్టురట్టు చేసే యత్నం
వెలికి తీసే పనిలో రెవెన్యూ అధికారుల నిమగ్నం
అడ్డుకట్ట వేసే పనిలో అధికార పార్టీ నేతలు
దూకుడు ప్రదర్శిస్తున్న అధికారుల్ని సాగనంపే యత్నాలు
సర్కారు భూమి పరిరక్షణకు అధికారులు సరైన నిర్ణయం తీసుకున్నారు. నిడగల్లులోని భూ బాగోతం మూలాలు వెలికితీసే పనిలో పడ్డారు. తీగలాగితే డొంక కదిలినట్టు మ్యూటేషన్‌కోసం ఒకరు చేసిన దరఖాస్తుతో అసలు విషయం వెలుగు చూసింది. కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు తెలుసుకున్న అధికారులు మొత్తం భూమి ఎలా అన్యాక్రాంతమైందో తెలుసుకునే పనిలో పడ్డారు. ఎవరి చేతిలో ఎంతెంత విస్తీర్ణంలో ఉండిపోయిందో లెక్కలు తేలుస్తున్నారు. పాలకపక్ష నేతల ఒత్తిళ్లను సైతం పక్కనబెట్టి... తమ విధులకు పూర్తి న్యాయం చేస్తున్నారు. అంతటితో ఆగని నేతలు అధికారులపై కక్షసాధింపులకు వ్యూహరచన చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : సీతానగరం మండలం నిడగల్లులోని సర్వే నంబర్ 4లో గల 10.90ఎకరాల భూములు ఎండీఆర్(మాన్యువల్ డయాగ్నేట్ రిజిస్టర్)లోనూ, సెటిల్‌మెంట్ ఫెయిర్ అడంగల్‌లోనూ గయ్యాలుగా ఉన్నాయి. కానీ, అవి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఎలా చేతులు మారాయో తెలియదు గాని ఫైనల్ చెక్ ఆపరేషన్(ఎఫ్‌సీఓ)లో మాత్రం రైత్వారీ పుంజుగా ఎక్కింది. ఇదెలా జరిగిందన్నదే అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. ప్రభుత్వ భూములు జిరాయితీగా ఎలా మారాయి? ప్రైవేటు వ్యక్తుల పేరున రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? వారి చేతికి పాసు పుస్తకాలు ఎలా వచ్చాయి? సబ్ డివిజన్ చేసి, రైత్వారీ పుంజుగా రికార్డుల్లోకి ఎలా ఎక్కించారు?
వీటిపై అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు
బట్ట బయలు కానున్న గూడుపుఠాణీ లోతుగా పరిశీలన చేస్తే అక్రమాలకు పాల్పడిన వారంతా బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆ భూములకు సంబంధించి లింకు డాక్యుమెంట్లు లేవు. కానీ, రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. పాసు పుస్తకాలు జారీ అయిపోయాయి. ఇదంతా చూస్తుంటే ఇక్కడేదో గూడుపుఠాణి జరిగినట్టు అన్పిస్తోంది. గత అధికారుల సహకారం లేకుండా జరిగే పని కాదని ప్రస్తుత అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదంతా వెలికి తీసే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా గ్రామంలో కూడా ఈ భూబాగోతం చిచ్చు రేపింది. క్రయ, విక్రయాలు చేసిన వారి మధ్య, బినామీల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రభుత్వ భూముల్ని ఎలా అమ్మారంటూ కొనుగోలు చేసిన వారు నిలదీస్తున్నారు. అమ్మకపోయి ఉంటే కొనేవాళ్లం కాదని కొనుగోలు దారులు గగ్గోలు పెడుతున్నారు. చివరి కొనుగోలు దారుడు ఓ సంస్థ ఏర్పాటు చేసేందుకు రుణం కోసమని మ్యూటేషన్ సర్టిఫికేట్ ప్రయత్నించడంతో ఈ భూదందా బయటపడింది.
అధికారుల్ని వదులుతారా?
రాజీపడకుండా వాస్తవాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారుల్ని టీడీపీ నేతలు వదలరనే వాదనలు ఉన్నాయి. ఆ అధికారులు ఇక్కడుంటే గుట్టు రట్టు అవుతుందని, అక్రమార్కులంతా బయటపడతారనే అభిప్రాయం గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో వారిని బదిలీపై సాగనంపితే వ్యవహారం వెలుగుచూడకుండా చెక్ పెట్టొచ్చన్న యోచనలో నేతలు ఉన్నట్టు తెలిసింది. ఆ దిశగా పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఇప్పుడున్న తహసీల్దార్ ఎన్నాళ్లూ ఉండరనే వాదన మొదలయ్యింది. ఆ మేరకు ఆయనకు సంకేతాలు అందినట్టు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో గుట్టు రట్టు కాకుండా నేతలు చెప్పినదానికి ఉన్నతాధికారులు తలొగ్గుతారా? లేదంటే అక్రమాల బాగోతమంతా బయటపెట్టేందుకు ప్రస్తుత అధికారులకు సహకరిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
Advertisement
Advertisement