సాక్షి, బెంగళూరు : పాశ్చాత్య పోకడలకు పోతున్న ఉద్యాన నగరిలో ’రాత్రి జీవనాన్ని’ (నైట్ లైఫ్) పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరులో నైట్ లైఫ్‌ను విస్తరించాలని ఐటీ తదితర రంగాల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని దీనికి ససేమిరా అంటూ వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నైట్ లైఫ్‌ను కోరుకునే టెక్కీలు, ప్రవాసుల మనసు గెలుచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ విషయంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది.
నైట్ లైఫ్ గడువును విస్తరిస్తామని గత శాసన సభ ఎన్నికల సందర్భంగా అనేక పార్టీలు మేనిఫెస్టోల్లో సైతం హామీలు గుప్పించాయి. ప్రస్తుతం రాత్రి 11 గంటల తర్వాత నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్బులను మూసి వేయాల్సి ఉంటుంది. ఈ గడువును ఒంటి గంట వరకు పొడిగించాలని డిమాండ్లు ఉన్నాయి. ఆదివారాల్లో మినహాయిస్తే మిగిలిన రోజుల్లో రాత్రి పూట కుటుంబాలతో హాయిగా రెస్టారెంట్లుకు వెళ్లే అవకాశమే లేనందున, సమయాన్ని పొడిగించాలనేది ప్రధాన డిమాండ్.
నగరానికి చెందిన యువ మంత్రి దినేశ్ గుండూరావు సైతం నైట్ లైఫ్ విస్తరణ పట్లే మొగ్గు చూపుతున్నారు. ఇతర అంతర్జాతీయ నగరాల్లాగే బెంగళూరునూ పరిగణించాలని ఆయన సూచిస్తున్నారు. అయితే దీనిపై ఏకాభిప్రాయం అవసరమని అన్నారు. నగరానికే చెందిన మరో మంత్రి కేజే. జార్జ్ కనీసం రెస్టారెంట్లకైనా సమయాన్ని పొడిగించాలని సూచిస్తున్నారు. ఆయన స్వయంగా హోం శాఖను నిర్వహిస్తున్నందున, బార్లు, పబ్బుల విషయంలో గట్టిగా మాట్లాడలేక పోతున్నారు. ఎందుకంటే...పోలీసు శాఖ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి పాలక బీజేపీ నైట్ లైఫ్ విస్తరణకు గట్టి హామీ ఇచ్చింది. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాసుల ఓట్లను కొల్లగొట్టడమే ఈ హామీ ఉద్దేశమనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీజేపీ పంథాలోనే యోచిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయానికి రాకున్నప్పటికీ, చట్టాన్ని మార్చాలని ప్రభుత్వానికే చెందిన టూరిజం విజన్ గ్రూపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించింది.
రాత్రి జీవనం 11 గంటలకే ముగియడంతో గత ఐదు నుంచి ఏడేళ్లలో ఫిలిప్ఫైన్స్ రాజధాని మనీలాకు మనం దాదాపు 50 వేల ఉద్యోగాలను పోగొట్టుకున్నామని విజన్ గ్రూపు అధిపతి టీవీ. మోహన్‌దాస్ పాయ్ ఓ సందర్భంలో చెప్పారు. ఆహార పదార్థాలు లభ్యమయ్యే రెస్టారెంట్లు, షాపింగ్ కోసం దుకాణాలను రాత్రి ఒంటి గంట వరకు తెరచి ఉంచాలని తాము ప్రభుత్వానికి సూచించామని ఆయన తెలిపారు.
అయితే బార్లు, పబ్‌ల విషయంలో పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 22 శాతం సిబ్బంది కొరతతో సతమతమవుతున్న తాము, రాత్రి జీవనాన్ని విస్తరించడం ద్వారా తలెత్తే శాంతి భద్రతల సమస్యను ఎలా పరిష్కరించాలని ప్రశ్నిస్తున్నారు. జనం రోడ్లపై తిరుగుతుంటే నేరాలకు అవకాశం ఉండదని కొందరు వాదిస్తున్నప్పటికీ, రాత్రి పూట ఈ వాదన పనికి రాదని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెబుతున్నారు.
‘నైట్ లైఫ్’ పెంపు
Published Tue, Feb 4 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
Advertisement
Advertisement