నయన్‌కు నిత్యానంద ఆహ్వానం?
ఆధ్యాత్మిక స్వామీజీ నిత్యానంద నుంచి నటి నయనతారకు ఆహ్వానం వచ్చినట్లు సమాచారం. సంచలనాలకు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారిన వీరిద్దరి గురించే ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు నిత్యం వార్తల్లో ఉన్న నిత్యానంద కొద్ది రోజులుగా అలాంటివాటికి దూరంగా ఉన్నారనుకున్నారు. అంతలోనే నయనతారకు ఆహ్వానం అంటూ మళ్లీ కోలీవుడ్‌లో కలకలానికి కారణం అయ్యారు. ఇక నటి నయనతార గురించి చెప్పనే అక్కర్లేదు. ప్రేమలు, బ్రేకప్‌లంటూ ఈ బ్యూటీ సృష్టించిన సంచలనాలు ఎన్నో. అలాంటి నయనతార ప్రస్తుతం కొంచెం మనశ్శాంతి కోరుకుంటుందట. ఈ విషయం తెలుసుకున్న నిత్యానంద స్వామీజీ తమ ఆశ్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం.
ఆయన తరపున ఓ వ్యక్తి ఇటీవల నయనతారను కలిసి మెడిటేషన్ వల్ల కలిగే సత్ఫలితాలు, తమ ఆశ్రమంలో కలిగే ప్రశాంతత, మనశ్శాంతిల గురించి వివరించినట్లు తెలిసింది. అయితే నయనతార ప్రస్తుతానికి నిత్యానంద ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు సమాచారం. అందుకు కారణం పలు షూటింగ్‌లతో బిజీగా ఉండటమేనని తెలిసింది. రీఎంట్రీలో వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న నయనతార చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉంది. ప్రస్తుతం జయం రవి సరసన తనీ ఒరువన్ చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నన్బేండా, సూర్యతో మాస్, విజయ్ సేతుపతికి జంటగా నానుం రౌడీదాన్ చిత్రాలు చేస్తోంది. ఇప్పటికీ నటి రంజిత నిత్యానంద స్వామీజీకి ప్రథమ శిష్యురాలిగా ఆయన ఆశ్రమ సేవలకే అంకితమైంది. ఇటీవల బాలీవుడ్ నటి శ్వేతా తివారీని కూడా నిత్యానందస్వామీజీ ఆహ్వానించారని తెలిసింది. మరి ఆమె స్పందన ఏమిటో తెలియలేదు.