సునంద మృతి మిస్టరీ వీడేదెప్పుడో!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేసేం దుకు ఢిల్లీ పోలీసుశాఖకు చెందిన రెండు విభాగాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కేసును విచారించేందుకు నిరాకరించిన నేర విభాగం (క్రైంబ్రాంచ్) తిరిగి దక్షిణ జిల్లా పోలీసులకే బదిలీ చేసింది. అయితే వారు ఈ కేసుపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నెల 17న దక్షిణ ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో 52 ఏళ్ల పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంత్రి అధికారిక నివాసాన్ని ఆధునీకరిస్తుండటంతో భర్త, కేంద్ర మంత్రి శశి థరూర్‌తో కలిసి సునంద హోటల్‌లోనే ఉంటున్నారు.
ఈ కేసును మొదటగా చేపట్టిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్‌డీఎం) విచారించి సదరు నివేదికను దక్షిణ ఢిల్లీ పోలీసులకు వారం రోజుల్లోనే సమర్పించారు.పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పుష్కర్ విషం సేవించిందని, ఆమె శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఈ కేసును దర్యాప్తు చేయాల్సిన అవసరముందని ఎస్‌డీఎం పోలీసులకు సూచించారు. అయితే ఈ కేసు విచారణను ప్రారంభించిన దక్షిణ జిల్లా పోలీసులు మరుసటి రోజే నేర విభాగానికి అప్పగించారు. అయితే ఈ కేసును తాము దర్యాప్తు చేయాల్సిన అవసరమేమీ కనబడటం లేదని నేర విభాగ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
తమ విభాగంలో ఇప్పటికే సిబ్బంది కొరత ఉందని, అనేక కేసులు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికే అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇదిలావుండగా ఈ కేసు గురించి దక్షిణ జిల్లా పోలీసులు ఏమీ మాట్లాడం లేదు. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని కారణంతో పుష్కర్ ఆత్మహత్య చేసుకుందని వదంతులు వినవస్తున్నాయి. ఆమె చనిపోయే ముందు సదరు జర్నలిస్ట్‌తో థరూర్‌కు ఉన్న సంబంధం గురించి సామాజిక అనుసంధాన వేదికలో ఆమె ట్వీట్ చేయడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. 2010లో పుష్కర్, థరూర్‌లు పెళ్లి చేసుకున్నారు.