ఘజియాబాద్: జిల్లాలోని ఖిన్‌ఖోడా గ్రామంలోకి రాజకీయ నాయకులను అనుమతించడం లేదు. ఈ మేరకు ఆ గ్రామంలో పోలీసులు నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నారు. గ్రామంలో ఒక వర్గం వారు మహిళపై లైంగికదాడి చేసి అనంతరం మతమార్పిడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం గ్రామంలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్వహించిన యజ్ఞాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, వీహెచ్‌పీ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో తమ అనుమతి లేకుండా ఏ పార్టీకి చెందిన నాయకుడూ గ్రామంలోకి అడుగుపెట్టేందుకు వీలులేదని జిల్లా రూరల్ ఎస్పీ జగదీష్ శర్మ తెలిపారు. కాగా, గురువారం గ్రామంలోకి ప్రవే శించడానికి యత్నించిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు అరవింద్ భారతీయ, ఇతర కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
గ్రామంలో బుధవారం పోలీసులకు, వీహెచ్‌పీ కార్యకర్తలకు మధ్య జరిగిన గొడవలో ఒక పోలీస్ అధికారి సర్వీస్ రివాల్వర్ పోయింది. దాంతో గ్రామంలోకి రాజకీయ నాయకుల రాకపై నిషేధం విధించారు. ఇదిలా ఉండగా, మహిళపై అత్యాచారం చేసి మతమార్పిడి చేశారన్న విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించి యజ్ఞం చేసేందుకు యత్నిస్తున్నారన్న సమాచారంతో నివారీ పోలీస్ స్టేషన్ అధికారి ఓం ప్రకాశ్ మాథూర్ నేతృత్వంలో పోలీసుల బృందం ఖిన్‌ఖోడా చేరుకుంది. అనంతరం స్థానిక శివ మందిర్ సమీపంలో నిర్వహిస్తున్న సమావేశాన్ని, యజ్ఞాన్ని వీడియో తీయడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు తమ మత విశ్వాసాలకు భంగం కలిగించారని, బూట్లతో యజ్ఞవాటిక వద్ద తిరుగాడారని వీహెచ్‌పీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జీ చేయగా, ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పోలీస్ అధికారి సర్వీస్ రివాల్వర్ ఎక్కడో పడిపోయింది. కాగా, రివాల్వర్ పోయిన ఘటనలో పోలీసులు గ్రామంలోని చిన్నపిల్లలను, మహిళలను సైతం విచక్షణారహితంగా కొట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అరవింద్ ఆరోపించారు. కాగా, ఈ ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో 12 మందిని విడిచిపెట్టామని, 8 మంది అదుపులోని ఉన్నారని, సుఖ్‌బీర్, తాపేష్, ఛోటేలాల్‌లను జైలుకు పంపామని రూరల్ ఎస్పీ శర్మ తెలిపారు. గ్రామంలో పోలీస్ పహారా కొనసాగుతోందని, ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని ఆయన వివరించారు.
రాజకీయ నాయకులకు నో ఎంట్రీ
Published Thu, Aug 7 2014 10:56 PM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM
Advertisement
Advertisement