మహిళకు మొండిచేయి.. | no preference to ladies in politics in western Maharashtra | Sakshi
Sakshi News home page

మహిళకు మొండిచేయి..

Published Fri, Mar 14 2014 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

no preference to ladies in politics in western Maharashtra

 సాక్షి, ముంబై: పశ్చిమ మహారాష్ట్రలో రాజకీయంగా మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదనే చెప్పవచ్చు. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువగానే ఉన్నా ఎన్నికల్లో పోటీచేసి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన మహిళా సభ్యుల సంఖ్య నామమాత్రంగా ఉండటం గమనార్హం. గత 62 సంవత్సరాల్లో పశ్చిమ మహారాష్ట్రలోని ఆరు లోకసభ ఎన్నికల్లో కేవలం నలుగురు మహిళలే ఎన్నికయ్యారు. ముఖ్యంగా ఇప్పటివరకు పురుషులకు వ్యతిరేకంగా పురుషులు పోటీపడినప్పటికీ ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఒకే ప్రాంతంలో మహిళల మధ్య పోటీ జరగకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.

దీన్నిబట్టి రాష్ట్ర రాజకీయాల్లో మహిళలకు లభిస్తున్న ప్రాధాన్యత గురించి అర్థం చేసుకోవచ్చు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకువెళ్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ రాజకీయాల్లో ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల్లో ఇంకా రాణించాల్సి ఉందని చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మహిళలకు పట్టం కట్టినప్పటికీ వెనుకనుంచి నడిపించేది మాత్రం వారి భర్తలు, తండ్రులు లేదా సోదరులే అవుతున్నారు. అదేవిధంగా పోటీచేసే స్థానాలు మహిళలు రిజర్వ్‌డ్ కావడంతో లేదా ఇతర కారణాలతో తమ ఇంటి మహిళలను ఎన్నికల బరిలో దింపుతున్నారు తప్పితే స్వతంత్ర భావాలతో ఏ మహిళా ఇలాంటి స్థానాల్లో పోటీచేయడంలేదనే చెప్పవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే మహిళల్లో మరింత చైతన్యం అవసరమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

 పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్, హాతకణంగలే, సాంగ్లీ, సతారా, షోలాపూర్, కరాడ్ (పాత లోకసభ)  మొత్తం ఆరు లోకసభ నియోజకవర్గాలను పరిశీలించినట్టయితే ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కేవలం నలుగురు మహిళలు విజయం సాధించారు. కొల్హాపూర్ లోకసభ నియోజకవర్గం నుంచి 1967లో విజయమాలా రాణిసాహెబ్, 1973, 1989లలో కరాడ్ లోకసభ నుంచి ప్రమీలాకాకి చవాన్, 1983లోనే సాంగ్లీ నుంచి షాలినితాయి పాటిల్, 1999, 2004లో ఇచలకరంజీ నుంచి నివేదితా మానే మొదలగు నలుగురు మహిళలున్నారు. అయితే వీరితోపాటు 1998లో ఇచల్‌కరంజీ లోకసభ నుంచి సీపీఐ టికెట్‌పై మాయా పండిత్, 2004లో కొల్హాపూర్ లోకసభ నియోజకవర్గం నుంచి పీడబ్ల్యూపీ తరఫున సునందా మోరే పోటీచేశారు. అయితే వీరు పరాజయం పాలయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement