ఓటర్లకు గాలం! Ministers offer help to those standing to lose homes | Sakshi
Sakshi News home page

ఓటర్లకు గాలం!

Published Wed, Oct 16 2013 11:04 PM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

Ministers offer help to those standing to lose homes

రాష్ర్టంలో ఎన్నికల వాతావరణ క్రమంగా పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రజాస్వామ్య కూటమి యత్నిస్తోంది. నజరానాలు భారీగా ప్రకటిస్తోంది. ఎన్నికల కోడ్  వచ్చేలోగా వీలైనన్ని ‘సంక్షేమ’ పథకాలను ప్రకటించి, ప్రజల అనుగ్రహాన్ని సంపాదించేందుకు పావులు కదుపు తోంది. సర్కారు ఎన్నికల జిమ్మిక్కులు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడంలేదు.
 
 సాక్షి, ముంబై:మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మాడా) నిర్మించిన ఇళ్లలో నివాసముంటున్న పేద ప్రజలకు  ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. మాడా నిర్మించిన భవనాలను మాడా పరిపాలన విభాగం ద్వారా తిరిగి అభివృద్ధి చేయించుకుంటే ఒక్కొక్కరికి కనీసం 405 చదరపు అడుగుల ఇల్లు లభించనుంది. అంతేగాక నివాసులకు కార్పస్ ఫండ్ కూడా లభించనుంది. దీన్ని వచ్చే సంవత్సరం జరగనున్న లోక్‌సభ, శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2014 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
 
 కాగా మాడా నిర్మించి సిద్ధంగా ఉంచిన నాలుగు వేల ఇళ్లకు మేలో లాటరీ వేయాలని సంకల్పించింది. అందుకు అవసరమైన ప్రకటనల ప్రక్రియను ఎన్నికల ప్రవర్తన నియమాలి (కోడ్) అమలులోకి రాకముందే పూర్తిచేయాలని ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉంది. దీన్ని బట్టి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. మాడా కాలనీల పునరాభివృద్థి పనులు ప్రైవేటు బిల్డర్ల ద్వారా కాకుండా మాడా ద్వారా చేయించుకుంటే 10 శాతం చ.ట. అదనంగా ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాని ఎన్నికలు సమీపించడంతో ఓటర్లను సంతోషపెట్టేందుకు 10 శాతానికి బదులుగా 15 శాతం చ.ట. అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అందుకు నియమాలలో అవసరమైన మార్పులు చేసినట్లు మాడా ఉపాధ్యక్షుడు సతీష్ గవయి చెప్పారు. 
 
 సాధారణంగా ప్రైవేటు బిల్డర్లు ఎక్కువ చ.ట. ఇల్లు, పెద్ద ఎత్తున కార్పస్ ఫండ్ ఇస్తామని ఆశ చూపించి నివాసులను మోసం చేస్తున్నారు. కాని ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయంవల్ల ప్రైవేటు బిల్డర్ల మోసాలకు ఇక కళ్లెం పడనుంది. నివాసులు ప్రైవేటు బిల్డర్లను కాదని మాడా వద్దకు రావాలని, వారు ఇచ్చే అదనపు చ.ట. భారీగా కార్పస్ ఫండ్ తదితర సదుపాయాలను మాడా కూడా ఇస్తుందని గవయి వెల్లడించారు. కొన్ని సందర్భాలలో ప్రైవేటు బిల్డర్లు చెల్లిస్తున్నంత కార్పస్ ఫండ్ ఇవ్వకున్నప్పటికీ కొద్దిగా అటు, ఇటుగా మాడా  చెల్లించనుందని ఆయన ధీమా వ్యక్తం చే శారు. 2014 మేలో మాడా, కొంకణ్ మండలి నిర్మించిన ఇళ్లకు సంయుక్తంగా లాటరీ వేయనున్నారు. కొంకణ్ మండలికి చెందిన విరార్‌లో 2,500 ఇళ్లు, మాడాకు చెందిన ముంబైలోని వివిధ ప్రాంతాల్లో 1,500 ఇలా మొత్తం నాలుగు వేల ఇళ్లకు లాటరీవేసి అర్హులైన పేదలకు చౌక ధరకే ఇల్లు అందజేయనుంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement