కర్ణాటక, మైసూరు : వరమహాలక్ష్మి పండగ సందర్భంగా రూ.10 వేల పట్టుచీర రూ.4 వేలకే ఇవ్వనున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళకు తీవ్ర నిరాశ ఎదురైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న కూడా సగం ధరలకే మైసూరు పట్టు చీరలను అందించనున్నట్లు పట్టుపరిశ్రమశాఖ మంత్రి సారా మహేశ్ ప్రకటించారు. దీంతో వరమహాలక్ష్మి పండుగ సందర్భంగా చీరల కోసం మహిళలు నగరంలోని కేఎస్‌ఐసీ షోరూమ్‌ల ఎదుట బారులు తీరారు.
ఆధార్‌కార్డులు, డబ్బులు, పట్టుచీరలు తెచ్చుకోవడానికి సంచులతో ఎంతో ఉత్సాహంతో అక్కడికి వెళ్లిన మహిళలు కొడగు జిల్లాలో చోటుచేసుకున్న ప్రకృతి వైపరిత్యాల కారణంగా పట్టుచీరలపై ప్రకటించిన ఆఫర్ ఉపసంహరించుకున్నామంటూ షోరూమ్‌ల అద్దాలపై అతికించిన నోటీసులు చూసి తీవ్ర నిరాశకు లోనయ్యారు. రెండు నెలలుగా సగం ధరలకే పట్టుచీరలు ఇస్తామంటూ ఆశలు పెంచి పండుగరోజున చీరల కోసం దుకాణాలకు వెళ్లాక ఇలా ఇవ్వడం కుదరంటూ చెప్పడం ఏమిటంటూ మహిళలు అధికారులపై మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని ఈ విషయంలో మేమేమి చేయలేమంటూ అధికారులు స్పష్టం చేయడంతో చేసేదిమి లేక తమ దురదృష్టాన్ని తిట్టుకుంటూ మహిళలు నిరాశగా ఇళ్లముఖం పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment