హాసన్ : ఇష్టం లేని పెళ్లితో కాపురం చేయలేనని ఓ నవ వధువు పెళ్లయిన ఆరు రోజులకే కుటుంబ సభ్యులకు నిద్రమాత్రలు ఇచ్చి ఇంటిలో నుంచి పారిపోయిన సంఘటన ఇక్కడి సకలేశ్‌పుర తాలూకాలో సంచలనం రేపింది. అంతటితో ఆగకుండా ఏకంగా తనను చదివించి, పెళ్లి చేసిన మేనమామపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు... సకలేశపుర తాలూకాలోని హానుబాలు సమీపంలో హదిగే గ్రామానికి చెందిన కుసుమను కొంతనమనె గ్రామానికి చెందిన మోహన్‌కు ఇచ్చి ఈనెల 6న వివాహం జరిపించారు. వధువుకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమెను పెంచి పోషించిన మేనమామ నీలరాజు కుసుమ బాగోగులు చూసుకునేవాడు. పీయూసీ వరకు కుసుమను చదివించి వరుడు మోహన్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు.
ఆరు రోజుల వరకు ఇంటిలోని వారితో కలిసి ఉన్న కుసుమ పారిపోవడానికి ముందు ఇంటిలోని వారికి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో పారిపోయింది. ఇదే సమయంలో వరుడు మోహన్ సైతం వధువు పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాల వారిని పిలిపించి మాట్లాడారు. అనంతరం కుసుమను మహిళా సహాయ కేంద్రానికి తరలించారు. ఇదే సమయంలో కుసుమ తాను చదువుకుంటున్న సమయంలో ఓ యువకుడిని ప్రేమించానని, తన మేనమామ బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి జరిపించాడని వాపోయింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment