తత్కాల్‌లో వివాహ నమోదు సర్టిఫికెట్
న్యూఢిల్లీ: తత్కాల్ సర్వీసులో పాస్‌పోర్టు, రైలు టికెట్లు పొందినట్టుగానే వివాహ ధ్రువీకరణ పత్రం కూడా కేవలం 24 గంటల్లో నగరవాసులకు ఢిల్లీ ప్రభుత్వం అందిస్తోంది. దంపతుల అవసరం, ప్రాధాన్యతను బట్టి వివాహ నమోదును ఒకేరోజులో అధికారికంగా ధ్రువీకరించేలా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంది. కాగా, 2006 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పెళ్లి అయిన నగరవాసులు 60 రోజుల్లోపు వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని ఢిల్లీ ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఈ పత్రం పొందే విషయంలో అనేక మంది ఇబ్బందులు పడటాన్ని దృష్టిలో ఉంచుకున్న సర్కార్ కేవలం 24 గంటల్లో వారికి వివాహ ధ్రువీకరణ పత్రం అందించాలని నిర్ణయించిందని రెవెన్యూ విభాగ కార్యదర్శి ధారమ్ పాల్ ఆదివారం విలేకరులకు తెలిపారు.
గత నెల 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ సేవలకు మంచి స్పందన లభిస్తుందన్నారు. అత్యవసరమున్న వారు అనేక మంది ఒక్కొక్కరు పదివేల రూపాయల ఫీజు చెల్లించి 24 గంటల్లో సర్టిఫికెట్ పొందుతున్నారని తెలిపారు. హిందూ వివాహ చట్టం కింద నమోదు కోసం దరఖాస్తు ఫీజును రూ.100, ప్రత్యేక వివాహ చట్టం కింద రూ.150లు వసూలు చేస్తున్నామన్నారు. అప్లికేషన్ కోసం అవసరమైన ఆఫిడవిట్ల కొనుగోలు కోసం సుమారు రూ.400 నుంచి 500లు దరఖాస్తుదారులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.
పస్తుతం వివాహాల నమోదును అదనపు మేజిస్ట్రేట్ పర్యవేక్షిస్తోందని, సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌కు కూడా ఈ పనులు అప్పగించాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే వివాహ నమోదు ప్రక్రియలో పారదర్శకత ఉండటంతో పాటు ఉచిత నమోదు ప్రక్రియ కోసం వచ్చే నెల నుంచి ఓ పోర్టల్‌ను ప్రారంభించాలనుకుంటున్నామని తెలిపారు. ఈ పోర్టల్ నుంచి దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సర్టిఫికెట్ పొందేందుకు దశల వారీ ప్రక్రియ వివరాలు కూడా అందులో తెలుసుకోవచ్చని చెప్పారు. వినియోగదారులు తమ దరఖాస్తు స్థితి ఏ దశలో ఉందో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పాల్ వెల్లడించారు.
లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశాలను అనుసరించి ఢిల్లీ (వివాహ నమోదు తప్పనిసరి) ఆదేశం, 2014ను కులం, మతం, వధువు, వరుడు కులాలను పరిగణనలోకి తీసుకోకుండా అందరికీ వివాహ సర్టిఫికెట్‌లు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఢిల్లీలో పెళ్లి చేసుకోవాలంటే వరుడి వయస్సు 21 సంవత్సరాలు, యువతి వయస్సు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలనే నిబంధనను తీసుకొచ్చారు. పెళ్లి చేసుకోబోయే వారిలో ఒకరు భారతీయ పౌరుడై ఉండి, వివాహ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలనే ఆదేశాలు ఉన్నాయని పాల్ తెలిపారు. దంపతులు తమ ప్రాంతాల్లోని వివాహ అధికారికి ఫారమ్-ఏను సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవాలి. దీంతో వయస్సు, పౌరసత్వం, వరుడి, వధువు గుర్తింపు కార్డు, వివాహం జరిగిందనే దానికి రూఢి, వారు నివాసముండే పత్రాలను కూడా సమర్పించాలని ఆయన వివరించారు.