కాకినాడలో జూనియర్ ఎన్టీఆర్ సందడి
కాకినాడ రూరల్ : ప్రముఖ సినీనటులు జూనియర్ ఎన్టీ రామారావు, నందమూరి హరికృష్ణలు శుక్రవారం కాకినాడలో సందడి చేశారు. శనివారం సాయంత్రం దివంగత నందమూరి జానకీరామ్ కుమారులు, ప్రముఖ ల్యాండ్‌లార్డ్ యార్లగడ్డ ప్రభాకరచౌదరిల మనుమలకు పంచెకట్టు కార్యక్రమం జరగనుంది.
కరప మండలం వేళంగిలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, హరికృష్ణలు కాకినాడలోని మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం ఎన్టీఆర్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడన్న సమాచారం ఉదయమే తెలియడం, దానికి తోడు కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టడం తదితర సమాచారం మేరకు పెద్ద ఎత్తున అభిమానులు సర్పవరం జంక్షన్ సమీపంలోని చుండ్రు శ్రీహరి నివాసానికి తరలివచ్చారు. భారీ ఎత్తు అభిమానులు తరలిరావడంతో కాకినాడ– పిఠాపురం రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. ఎన్టీఆర్, హరికృష్ణ, శ్రీహరిలు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయారు.
కోటలో సందడి..
సామర్లకోట : రాజమండ్రి నుంచి కాకినాడ వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్ సామర్లకోటలో కొద్ది సేపు సందడి చేశారు. పెద్దాపురం ఏడీబీ రోడ్డు మీదుగా కాకినాడ వెళుతున్న సమయంలో శుక్రవారం ఏడీబీ రోడ్డులో అభిమానులు తరలి వచ్చారు. ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షుడు కె.భాస్కర్‌చౌదరి, పిల్లి కృష్ణప్రసాద్, వెంకట్, తోట గోపి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే వచ్చి వెళ్లిన సీఎం సతీమణి భువనేళ్వరి
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శుక్రవారం కరప మండలం వేలంగి యార్లగడ్డ ప్రభాకరచౌదరి ఇంటికి వచ్చి వెళ్లారు. ఈమె పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచారు. ముఖ్యమంత్రి రావాల్సి ఉండగా విదేశీ పర్యటన కారణంగా ఆయన సతీమణి వచ్చివెళ్లినట్టు చుండ్రు వెంకన్నరాయ్‌చౌదరి తెలిపారు.