
రాజధానిలో ‘అధికార’ అరాచకం
అఖిలప్రియపై దాడికి యత్నించారంటూ 8 మంది అరెస్టు
సాక్షి, అమరావతి బ్యూరో/ తుళ్లూరు రూరల్: రాజధానిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన విజయవంతం కావడంతో టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనంపై దాడికి యత్నించారనే అసత్య ప్రచారాన్ని సాకుగా చేసుకుని అమాయకులైన ఎనిమిది మంది యువకులపై తప్పుడు కేసు నమోదు చేసింది. తుళ్లూరు మండలానికి చెందిన ఎనిమిది మంది యువకులను పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత అరెస్టు చేశారు. అదే సమయంలో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ఏకంగా ఫ్లెక్సీలు పట్టుకుని రోడ్డుకు అడ్డుగా నిలబడ్డ టీడీపీ కార్యకర్తలను విడిచి పెట్టడం గమనార్హం. రాజధానిలో రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు జగన్ గురువారం తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల పరిధిలో పర్యటించిన విషయం తెలిసిందే. జగన్ పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా నాలుగు 420 బ్యాచ్‌లను టీడీపీ నేతలు రంగం లోకి దింపారు. అయినా పర్యటన విజయవంతం కావడంతో... పర్యటనలో పాల్గొన్న అమాయక యువకులపై కేసు నమోదు చేయించారు.
అర్ధరాత్రి అక్రమ అరెస్టులు: జగన్‌పై అభిమానంతో పర్యటనలో పాల్గొన్నారనే కారణంతో దరావత్ గోపినాయక్, లాలాది శ్రీనాథ్, బుద్దా రాజేష్, మేరిగ రాజేష్, చెరుకూరి రాజేష్, కర్రి సుధాకర్, డి.ప్రవీణ్‌కుమార్, పూసల వెంకట బిపిన్‌దత్త శర్మ (శివాలయం పూజారి)ని పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటాక అరెస్టు చేసి తుళ్లూరు స్టేషన్‌కు తీసుకొచ్చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనాన్ని అడ్డుకుని దాడికి యత్నించారనే అసత్య ప్రచారం ఆధారంగా వీరిపై కేసులు నమోదు చేశారు. సీసీ పుటేజీలో ఎవరు, ఎవరిని అడ్డుకున్నారో స్పష్టత లేదు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు బైక్ ర్యాలీ వస్తుండటంతో వాహనాలేవీ సచివా లయంలోకి వెళ్లే అవకాశం లేదని పోలీసులతో పాటు, ర్యాలీలో పాల్గొన్న వారు వెలగపూడి నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించే ప్రయత్నం చేసినట్లు వెళ్లడించారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనాన్ని అటువైపు వెళ్లాలని ర్యాలీలో పాల్గొన్నవారు సూచించినట్లు స్పష్టం చేశారు. వాస్తవంగా వాహనంలో ఉన్న మహిళ ఎమ్మెల్యే అని కానీ, భూమా నాగిరెడ్డి కుమార్తె అని ర్యాలీలో పాల్గొన్న చాలామందికి తెలియదని స్థానికులు చెప్పారు. ఆమె ఎవరో తెలియ నప్పుడు దాడి ఎలా చేస్తామని ప్రశ్నించారు.
రంగంలోకి టీడీపీ 420 బ్యాచ్
జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు నాలుగు 420 బ్యాచ్‌లను రంగంలోకి దించారు. కురగల్లులో పోలవరపు హరి, చావలి ఉల్లయ్య, తోట ముసలయ్య, మరి కొందరు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. హరి, ఉల్లయ్యకు ఒక్క సెంటు భూమి కూడా లేదు. వీరిపై ఇదివరకే మంగళగిరి పోలీస్టేషన్లో కేసులు నమోదు కావడం గమనార్హం. నవులూరు గ్రామానికి చెందిన హరి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.2 లక్షలు తీసుకుని మోసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 420 కేసు నమోదు చేశారు. మంగళగిరి మండల టీడీపీ ఆధ్యక్షుడు చావలి ఉల్లయ్య, అతని కుమారుడు మురళీకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై ఉంది. వైఎస్ జగన్ పర్యటను అడ్డుకునేం దుకు రంగంలోకి దిగిన వారిలో ఎక్కువ శాతం మంది భూమిలేని వారే కావడం గమనార్హం.