పడగవిప్పిన పాతకక్షలు
కోలారు(బెంగళూరు): పాతకక్షలు పడగవిప్పి ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో కీలుకోట ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల కథనం మేరకు.. కీలుకోటలోని కుమార్ అనే వ్యక్తి కుమార్తెను ట్యాంకర్ డ్రైవర్ అభి ప్రేమించాడు. విషయం తెలుసుకున్న కుమార్ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆరు నెలలక్రితం అభిని విశ్వేశ్వరయ్య స్టేడియం వద్ద హత్య చేశారు. ఘటనలో కుమార్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసు అరెస్టు చేశారు. ఏ3 గా నిందితుడిగా ఉన్న కుమార్ ఇటీవలే బెయిల్‌పై విడుదల కాగా మరో ఇద్దరు జైల్లోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో అభి వర్గానికి చెందిన వారు నగరంలోని కీలుకోట సమీపంలో రైల్వే బ్రిడ్జి కింద శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కాపుగాసి కుమార్(55)పై కొడవళ్లతో దాడి చేశారు. ఘటనలో కుమార్ కుడిచేయి తెగిపోగా మొడపై తీవ్రంగా గాయమైంది. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆర్‌ఎల్ జాలప్ప మెడికల్ కళాశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘటన అనంతరం కుమార్ సంభంధీకులు కీలుకోట వద్ద ఏర్పాటు చేసిన నగర సభ మాజీ సభ్యుడు దివంగత నిరంజన్ శిలాఫలకాన్ని, వార్డుల వివరాలు తెలియజేసే బోర్డును ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. జిల్లా ఎస్పీ దివ్య గోపినాథ్, బెంగళూరు ఏఎస్పీ నారాయణ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. ఘటనకు సంభందించి నగరసభ కౌన్సిలర్ కాశీ విశ్వనాథ్, గోపాల్, నరసింహమూర్తిలను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా దాడికి పాల్పడిన నిందితులున అరెస్ట్ చేయాలని భారతీయ అస్పృశ్యతా నిర్మూలనా పోరాట సమితి కార్యకర్తలు ధర్నా చేశారు.