
రూ.కోటి విలువైన బంగారం పట్టివేత
సాక్షి, ముంబై: దుబాయ్ నుంచి సుమారు నాలుగు కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న మహిళను పుణే విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ వారు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి... ముంబైలోని జోగేశ్వరిలో నివాసముంటున్న అగ్వాన్ అసమ్మ, దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో పుణేలో దిగింది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదా చేయగా, ఆమె నడుం చుట్టూ సుమారు నాలుగు కిలోల బరువున్న బంగారపు కడ్డీలు ఉండటం గమనించారు. వాటి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని కస్టమ్స్ కమిషనర్ వాసా శేషగిరిరావు తెలిపారు. నిందితురాలిని పోలీసులకు అప్పగించామని తెలిపారు.