భోజనానికి పిలవలేదని..
బెంగళూరు(బనశంకరి): మద్యం మత్తులో కూలీల మధ్య జరిగిన గొడవలో జార్ఖండ్‌వాసి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వర్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీసీపీ బోరలింగయ్య కథనం మేరకు వివరాలు.... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శబియాన (40), పరకాస్, సుకారాం, సణ్ణిలు వర్తూరు పరిధిలోని కొడతి హర్వెస్ట్ స్కూల్ వద్ద నిర్మాణ దశలో ఉన్న ట్రీవెంట్ అపార్టుమెంట్‌లో కమ్మీ కట్టే పనిచేస్తూ అక్కడే షెడ్డులో నివసిస్తున్నారు. నలుగురు వ్యక్తులు సోమవారం రాత్రి మద్యం సేవించి షెడ్‌లో పడుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో నిద్రిపోయిన శబియానను వదిలిపెట్టి మిగిలిన ముగ్గురు సమీపంలోని హోటల్‌కు భోజనానికి వెళ్లారు. కొద్దిసేపటి అనంతరం మేల్కొన్న శబియాన మిగతా ముగ్గురిని వెంబడించాడు.
తనను భోజనానికి పిలవకుండా వస్తారా అంటూ గొడవపడ్డాడు. ఓ దశలో సుత్తితో పరకాస్‌పై దాడి చేశాడు. తీవ్ర కోపోద్రిక్తుడైన పరకాస్ ఆదే సుత్తిని లాక్కుని శబియాన తల, ఇతర భాగాలపై దాడిచేశాడు. సమాచారం అందుకున్న మేస్త్రీ నయాన్‌సర్కార్, కంట్రాక్టర్ వెంకటరామరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన శబియానను ఆస్పత్రికితరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వర్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి పరకాస్, సుకారాం, సణ్ణిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పరకాస్ దాడికి పాల్పడినట్లు వెలుగుచూడటంతో అరెస్ట్ చేశారు.