- చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసిన కుమార, రమ్య, జనార్దన పూజారి
- 29 ఉపసంహరణకు గడువు
- ధార్వాడలో ప్రహ్లాద జోషిపై ముతాలిక్ పోటీ
- 28 స్థానాలు... 559 మంది అభ్యర్థులు
- మే 16 ఓట్ల లెక్కింపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు వచ్చే నెల 17న జరుగనున్న ఎన్నికలకు బుధవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 19న నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం వాటిని పరిశీలిస్తారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు శనివారంలోగా ఉపసంహరించుకోవచ్చు. మే 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆఖరు రోజు చిక్కబళ్లాపురం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి, బీజేపీ అభ్యర్థిగా బీఎన్. బచ్చేగౌడలు నామినేషన్లు దాఖలు చేశారు.
మండ్యలో కాంగ్రెస్ అభ్యర్థిగా నటి రమ్య, దక్షిణ కన్నడలో ఆ పార్టీ అభ్యర్థిగా జనార్దన పూజారిలు నామినేషన్లు వేశారు. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులుగా.. చిక్కోడిలో రాష్ట్ర చక్కెర శాఖ మంత్రి ప్రకాశ్ హుక్కేరి, బళ్లారిలో ఎన్‌వై. హనుమంతప్ప, ఉడిపి-చిక్కమగళూరులో ప్రస్తుత ఎంపీ జయప్రకాశ్ హెగ్డే, తుమకూరులో ముద్దు హనుమే గౌడ, బెంగళూరు ఉత్తరలో సీ. నారాయణస్వామి, ధార్వాడలో వినయ్ కులకర్ణి, హావేరిలో సలీం అహ్మద్, హాసనలో ఏ. మంజులు నామినేషన్లు దాఖలు చేశారు.
బీజేపీకి తిరుగుబాట్ల బెడద!
సొంత పార్టీ నుంచి కాకపోయినా ఇన్నాళ్లూ శ్రేయోభిలాషిగా ఉంటున్న శ్రీరామ సేన నుంచి బీజేపీకి తిరుగుబాట్ల బెడద మొదలైంది. తనకు పార్టీ సభ్యత్వం ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకోవడంపై ఆగ్రహం చెందిన సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ధార్వాడ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు. అక్కడ బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి పోటీ చేస్తున్నారు. కాగా 28 పార్లమెంటు స్థానాలకు 559 మంది అభ్యర్థులు తుది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బుధవారం ఒక్కరోజే 225 (సాయంత్రం ఆరుగంటల వరకూ) నామినేషన్లు వేశారు.