‘రాజా’కు కానుకల వెల్లువ
Published Fri, Sep 13 2013 12:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
సాక్షి, ముంబై: భక్తుల కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడిగా ప్రఖ్యాతి చెందిన ప్రముఖ ‘లాల్‌బాగ్ చా రాజా’ హుండీలో కానుకల వర్షం కురుస్తూనే ఉంది. కేవలం రెండు రోజుల్లో భక్తులు రూ.1.30 కోట్లు విలువచేసే కానుకలు సమర్పించుకున్నట్లు లాల్‌బాగ్ చా రాజా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండలి కోశాధికారి రాజేంద్ర లాంజ్‌వల్ చెప్పారు. గణేశ్ ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కాని భక్తులు రాజాను దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి నుంచి క్యూలో నిలబడ్డారు. సోమవారం ఉదయం నుంచి ఈ ప్రాంతమంతా జనసంద్రమైపోయింది. దాంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడింది. సోమ, మంగళ, బుధవారం రాత్రి వరకు ఇలా కేవలం మూడు రోజుల్లో 50 లక్షలకుపైగా భక్తులు రాజాను దర్శించుకున్నారని మండలి కార్యదర్శి సుధీర్ సాల్వీ తెలిపారు.
తమ మొక్కుబడులు తీరడంతో అనేక మంది తమ ఆర్థిక స్థోమతను బట్టి తోచిన విధంగా హుండీలో కానుకలు సమర్పించుకుంటారు. ఇలా రెండు రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలు మండలి పదాధికారులు లెక్కించారు. ఏటా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ముగిసేవరకు లాల్‌బాగ్ చా రాజాకు దాదాపు రూ.తొమ్మిది కోట్లకుపైగా నగదు, బంగారు, వెండి, ఇతర వస్తువుల రూపంలో కానుకలు చెల్లించుకుంటారు. ఈ కానుకలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం 11 రోజులపాటు సాగిన ఈ ఉత్సవాల్లో రాజాకు రూ.9.20 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చింది. కాని ఈ ఏడు తొమ్మిది రోజులు మాత్రమే ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో రూ.ఎనిమిది కోట్ల వరకు ఆదాయం రావచ్చని రాజేంద్ర లాంజ్‌వల్ అభిప్రాయపడ్డారు.
భక్తుల రద్దీని నియంత్రించడం ప్రభుత్వ పోలీసులకు, మండలికి చెందిన వేలాది కార్యకర్తలకు, ఇతర ప్రైవేటు భద్రతా సిబ్బందికి అగ్నిపరీక్షగా మారింది. మొక్కుబడులు చెల్లించుకునే వారికి కనీసం 20 గంటలకుపైగా సమయం పడుతోంది. క్యూలో ఉన్నవారికి తాగునీరు, అల్పాహారం ఉచితంగా అందజేస్తున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉపవాసాలతో క్యూలో నిలబడినవారు కళ్లు తిరిగి లేదా స్పృహ తప్పిపడిపోవడం లాంటి సంఘటనలు ఏటా చోటుచేసుకుంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేం ఆస్పతి వైద్య బృందం, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు.
Advertisement