ఇన్‌స్ట్రాగామ్‌లో నిజామాబాద్ మట్టి బాలగణపతికి లక్షల్లో వ్యూస్
ఛత్తీస్‌గఢ్‌లో ప్రత్యేకంగా తయారీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్ పంచముఖాంజనేయ స్వామి ఆలయం వద్ద హైందవసేన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలగణపతి విగ్రహం ఆకట్టుకుంటోంది. మట్టితో తయారు చేసి, పర్యావరణహిత రంగులు పూసిన ఈ 15 అడుగుల విగ్రహాన్ని చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల వారు సైతం భారీగా వస్తున్నారు. ఇక్కడ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన పలు ఉత్సవ సమితులు సైతం ఈ విగ్రహం గురించి అడిగి తెలుసుకుంటున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో తయారీ..
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు సమీపంలో మిలాన్ చక్రవర్తి అనే విగ్రహాల తయారీదారు ఈ బాలగణపతి విగ్రహాలను తయారు చేస్తున్నాడు. నిజామాబాద్‌కు చెందిన హైందవ సేన ఉత్సవ సమితి సభ్యులు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ విగ్రహాన్ని చూసి జనవరిలో ఆర్డర్ ఇచ్చారు. పూర్తిగా ఎండు గడ్డి, బంక మట్టితో తయారు చేసిన ఈ విగ్రహం లంబోదర ఆకృతిలో ఉంది. రాయ్‌పూర్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని నిజామాబాద్‌కు ఈ విగ్రహాన్ని తరలించేందుకు 5 రోజుల సమయం పట్టింది. ఈ విగ్రహానికి ఇన్‌స్ట్రాగామ్‌లో 22 లక్షల వ్యూస్ వచి్చనట్లు హైందవ సేన ఉత్సవ సమితి సభ్యులు చెబుతున్నారు.
ప్రభుత్వం ప్రోత్సహిస్తే..
ఇప్పటివరకు కొందరు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను పంచిపెడుతూ వస్తున్నాయి. కానీ అవి చిన్న విగ్రహాలే. భారీ విగ్రహాలు మాత్రం 95 శాతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవే. ఈ క్రమంలో మట్టి విగ్రహాల తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీ కష్టంతో కూడుకున్నది కావడంతో.. ఆ మేరకు తయారీదారులు, ఉత్సవాలు నిర్వహించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినట్లుగా ఉంటుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment