
చిదంబరం కన్నెర్ర
సాక్షి,చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూపు తగాదాలు రాజుకుంటున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంకు ఫిర్యాదు చేసి ఉన్నారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా ఈవీకేఎస్ ఇళంగోవన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గంతో ఢీ కొడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిన ఇళంగోవన్ గ్రూపు రాజకీయాలు సాగిస్తున్నారంటూ చిదంబరం వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ రెండు గ్రూపుల మధ్యసాగుతున్న వివాదంలో అధిష్టానం పెద్దలు జోక్యం కూడా చేసుకున్నారు. అయితే, ఫలితం శూన్యం. చిదంబరం వర్గానికి చెందిన పలువురు నాయకులకు పార్టీ నుంచి ఉద్వాసన పలుకుతూ ఈవీకేఎస్ తీసుకున్న నిర్ణయం వివాదాన్ని పెద్దది చేసింది. తన వర్గీయుల్ని అకారణంగా తొలగించడంపై చిదంబరం స్పందించారు. తమకు వ్యతిరేకంగా ఈవీకేఎస్ వ్యవహరిస్తున్న తీరుపై మళ్లీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే పనిలో చిదంబరం నిమగ్నం అయ్యారు. అధిష్టానం ద్వారా తమకు న్యాయం లభించని పక్షంలో తాడో పేడుకు రెడీ అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌కు చిదంబరం సైతం దూరం అయ్యారంటే, ఇక రాష్ర్టం లో ఆ పార్టీ భూస్థాపితమైనట్టే. రాష్ట్రంలో కొత్త పార్టీ దిశగా ఇది వరకు అడుగులు వేసిన చిదంబరం అధిష్టానం బుజ్జగింపులతో తలొగ్గిన విషయం తెలిసిం దే. అయితే, కొత్త పార్టీ ఏర్పాటు చేసి తీరాలన్న ఒత్తిడిని మద్దతుదారులు చిదంబరం మీద తెచ్చేపనిలో పడ్డారు. రాష్ట్రంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ వర్సెస్ చిదంబరం మధ్య వివాదం సాగుతుంటే, పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ నాయకులు రచ్చకెక్కారు.
ఎంపీ కొత్త ఇయక్కం :
పుదుచ్చేరి కాంగ్రెస్‌లో చీలికతో ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించి అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది. అక్కడి నేతల తీరుతో తాజాగా రాజ్య సభ సభ్యుడు కన్నన్ తిరుగు బావుటాకు సిద్ధం అయ్యారు. పుదుచ్చేరి కాంగ్రెస్ తరపున రాజ్య సభకు వెళ్లిన కణ్ణన్ గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా, నాయకులతీరును ఎండగట్టే రీతిలో స్పందిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన మక్కల్ మున్నేట్ర ఇయక్కంను ఏర్పాటు చేశారు. త్వరలో ఈ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చే అవకాశాలు ఎక్కువేనని ఆయన మద్దతు దారులు పేర్కొంటుండటం గమనార్హం.