సాక్షి, చెన్నై: వీసీకే, సీపీఐ, కాంగ్రెస్‌లు కలసి కట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. ఒకే కూటమిగా అవతరించాల్సిన అవశ్యం కూడా ఉందన్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా వీసీకే, సీపీఐ నేతలు సైతం వ్యాఖ్యానించడం బట్టి చూస్తే, త్వరలో కొత్త కూటమి ఆవిర్భవించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
రాష్ట్రంలో అత్యంత బలహీనంగా ఉన్న పార్టీ కాంగ్రెస్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీని డీఎంకే అక్కున చేర్చుకుంటుందా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ సమయంలో ఒకరు తమను అక్కున చేర్చుకోవడం ఏమిటీ...? తామే కూటమి ఏర్పాటు చేస్తామన్నట్టుగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ప్రయత్నాల్లో పడ్డారు. ఇందుకు అద్దం పట్టే విధంగా డీఎంకేకు దూరంగా ఉన్న వాళ్లను అక్కున చేర్చుకునేందుకు సిద్ధం అయ్యారు.
ఇందులో భాగంగా శుక్రవా రం సత్యమూర్తి భవన్‌లో జరిగిన ఓ వేడుకకు డీఎంకేకు దూరంగా ఉన్న వీసీకే నేత తిరుమావళవన్, సీపీఐ నాయకుడు సుబ్బరాయన్‌లను ఆహ్వానించారు. నేతలందరూ ఒకే వేదిక మీదకు రావడంతో ఆ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారన్న విషయం పక్కన పెట్టినా, నాయకులు రాజకీయాల్ని అందుకున్న కొత్త కూటమి ఆవిర్భావం లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడం విశేషం.
మా కూటమి: ఇక్కడ ఒకే వేదిక మీదకు సీపీఐ, వీసీకేలు , కాంగ్రెస్ రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. ఇక, 2004 ఎన్నికల పురాణం అందుకున్నారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్‌తో కలసి ఎన్నికల్ని ఎదుర్కొన్నాయని గుర్తు చేస్తూ, అధికార పగ్గాలు చేపట్టగానే ప్రజా సంక్షేమాన్ని కాంక్షించడం జరిగిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని అవినీతి పాలకులకు, పార్టీలకు చరమ గీతం పడాలంటే, ఒకే వేదిక మీదుగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
వీసీకే నేత తిరుమావళవన్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్, వీసీకే మధ్య భేదాభిప్రాయాలు అనేక విషయాల్లో ఉన్నాయని వివరించారు. అయితే, వాటన్నింటిని ఇప్పుడు మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మైనారిటీలకు పూర్తి భద్రత ఉండేదని, అయితే, ఇప్పుడు ఆ భద్రత కరువైందన్నారు. రాజకీయ స్వలాభం కోసం కాకుండా, ప్రజా సంక్షేమాన్ని, మైనారిటీల భద్రతను కాంక్షించే విధంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌తో పాటుగా అందరూ కలసి బీజేపీ పాలకులకు చరమ గీతం పడాల్సిన అవసరం ఉందని పిలుపు నివ్వడం గమనార్హం. ఇదే వ్యాఖ్యను సమర్థిస్తూ సీపీఐ నేత సుబ్బరాయన్ స్పందించడం విశేషం.
‘మా’ కూటమి
Published Sat, Mar 7 2015 2:10 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement