evks ilangovan
-
నన్నే తొలగిస్తావా నీకెక్కడిది అధికారం ?
-
నన్నే తొలగిస్తావా?
సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కుతున్నాయి. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యక్షుడు వసంత్ కుమార్ వార్ ప్రకటించారు. నిన్న గాక మొన్నటి వరకు తంగబాలు, చిదంబరం వర్గం ఈవీకేఎస్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ వస్తే, ఇక తామూ ఢీకి రెడీ అని వసంత్‌కుమార్ మద్దతు దారులు ప్రకటించారు. కాంగ్రెస్ అనుబంధ వర్తక సంఘం అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించ డాన్ని వసంత్‌కుమార్ తీవ్రంగా పరిగణించి ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. ఆ వివాదాలే ఆ పార్టీని రాష్ట్రంలో గడ్డు పరిస్థితుల్లోకి నెట్టాయి. కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకుంటామని నేతలు ప్రగల్బాలు పలుకుతూ వస్తున్నా, వివాదాల్ని మాత్రం వీడడం లేదు. ప్రధానంగా అధ్యక్ష పదవి కోసం గ్రూపు నేతల రాజకీయ పైరవీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎట్టకేలకు గ్రూపు నేతలందరూ ఏకం అయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఉద్వాసన పలికించడం లక్ష్యంగా సీనియర్ నేత చిదంబరంతో కలసి అడుగులు వేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తాజాగా తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి తదితర జిల్లాల్లో తన కంటూ వ్యక్తిగత పలుకు బడి కల్గి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఆకర్షించే సంస్థతో వ్యాపార వేత్తగా గుర్తింపు పొంది, తన కంటూ మద్దతు వర్గాన్ని కల్గి ఉన్న వసంతకుమార్ సైతం ప్రస్తుత అధ్యక్షుడు ఈవీకేఎస్‌పై తిరుగు బాటుకు సిద్ధం అయ్యారు. ఢిల్లీ పెద్దల చేత గుర్తించ బడ్డ వసంతకుమార్‌కు ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి సైతం దక్కింది. రాష్ట్ర కాంగ్రెస్ అనుబంధ వర్తక విభాగం అధ్యక్షుడిగా జాతీయ పెద్దల చేత నియమించ బడి 17 సంవత్సరాలు కొనసాగుతూ వస్తున్న వసంత్‌కుమార్‌కు రెండు రోజుల క్రితం ఈవీకేఎస్ పెద్ద షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో జోడు పదవులు తగదంటూ, వర్తక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో ఎంఎస్ ద్రవ్యంను ఈవీకేఎస్ నియమించారు. తనను తొలగించడాన్ని తీవ్రంగా పరిగణించిన వసంత్‌కుమార్ ఈవీకేఎస్‌పై వార్ ప్రకటించారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ఈవీకేఎస్‌పై ఢిల్లీకి ఫిర్యాదులు చేసే పనిలో పడ్డారు. నన్నే తొలగిస్తావా...: తనను వర్తక విభాగం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా పరిగణించిన వసంత్‌కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను తొలగించే అధికారం ఈవీకేఎస్‌కు లేదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కోసం తాను, తన ఛానల్, పత్రిక నిరంతరం శ్రమిస్తూ వస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పత్రికగా ఇండియన్, టీవీ ఛానల్‌గా వసంత్‌లు వ్యవహరిస్తున్నాయని, తన సొంత నిధులతో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ వస్తున్న తనపై ఈవీకేఎస్ కుట్రలు పన్ని ఉన్నారని మండి పడ్డారు. పార్టీ నాయకులతో కలసి తాను ఢీల్లికి వె ళ్లడాన్ని పరిగణలోకి తీసుకునే తనను తొలగించి ఉన్నారని మండి పడ్డారు. తనను తొలగించే అధికారం ఈవీకేఎస్‌కు ఎవరిచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తనను ఆ పదవి నుంచి తొలగించాల్సి వస్తే, అందుకు తగ్గ ఆదేశాలను అధినేత్రి సోనియాగాంధీ జారీ చేయాల్సి ఉందన్నారు. అయితే చట్ట విరుద్ధంగా తనను తొలగించి, ఆయనకు మద్దతుగా ఉన్న మరో వ్యక్తిని కూర్చోబెట్టి ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తన తొలగింపు చట్ట విరుద్ధమని, నేటికీ తానే వర్తక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈవీకేఎస్ చర్యలపై అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశామన్నారు. వసంత్‌కుమార్ వ్యాఖ్యలపై ఈవీకేఎస్ను మీడియా ప్రశ్నించగా నో కామెంట్ అంటూ మౌనం వహించడం గమనార్హం. -
170 టార్గెట్!
డీఎంకేలో ‘టీకేఎస్’ కలకలం వివాదాస్పద వ్యాఖ్యలు సంబంధం లేదన్న అధిష్టానం సాక్షి, చెన్నై : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధినేత ఎం కరుణానిధి ప్రయత్నాలకు ఎసరు పెట్టే విధంగా డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యలు సంధించారు. అధిష్టానం తుది నిర్ణయం తీసుకునేసినట్టుగా 170 నియోజకవర్గాల్లో బరిలో దిగుతున్నట్టు ప్రకటించి పార్టీలో కలకలం సృష్టించారు. ఈ వ్యాఖ్యలతో మేల్కొన్న డీఎంకే అధిష్టానం తమకు సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకోక తప్పలేదు.రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకునేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి వ్యూహాల్ని రచిస్తూ వస్తున్నారు. ఎలాగైనా తన నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటు లేదా, ఒంటరిగానైనా బరిలోకి దిగే విధంగా సమాలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కరుణానిధి వ్యూహాలకు, ప్రయత్నాలకు ఎసరు పెట్టే విధంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యలు చేయడం డిఎంకే వర్గాల్లో కలకలాన్ని రేపాయి. అధినేత కరుణానిధి లేదా, కోశాధికారి ఎంకే స్టాలిన్ నోటి నుంచి కూడా ఇంత వరకు వెలువడని పార్టీ వ్యవహారాలకు సంబంధించిన వ్యాఖ్యల్ని టీకేఎస్ చేయడం చర్చకు దారి తీసి ఉన్నది. ప్రస్తుతం ఝలక్, షాక్‌లు ఇచ్చే పార్టీలు ఎన్నికల సమయంలో తప్పని సరిగా కలసి వస్తాయన్న ధీమాతో ఉన్న కరుణానిధికి టీకేఎస్ వ్యాఖ్యలు పెద్ద షాక్‌ను ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ప్రత్యేక ప్రకటన ద్వారా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 170 టార్గెట్ : పార్టీ అధికార ప్రతినిధిగా, పార్టీ ప్రధాన కార్యాలయ వ్యవహారాల కార్యదర్శుల్లో ఒకరుగా ఉన్న టీకేఎస్ ఇళంగోవన్‌కు డీఎంకేలో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అలాంటి నాయకుడు ఏకంగా పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలతో ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి చర్చల్లోకి ఎక్కారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 170 స్థానాల్లో పోటీ చేయనున్నదని ప్రకటించారు. గత ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేయడం వల్లే గెలుపు అవకాశాల్ని అనేక నియోజకవర్గాల్లో కోల్పోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కలిసి వస్తే 30 సీట్లలోపే ఇవ్వడం జరుగుతుందన్నారు. జీకే వాసన్ ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో వాళ్లకు ఆ సీటే ఎక్కువ అంటూ పరోక్షంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీన పడిందని పేర్కొన్నారు. పీఎంకే, వీసీకేలు కుల పార్టీలు అని, కుల రాజకీయాలతో ముందుకు వెళ్తున్న ఈ పార్టీలను ఎవ్వరూ తమ తమ కూటముల్లోకి చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు.సీపీఎం, సీపీఐలను కలుపుకుని వెళ్తామని, వారితో డిఎంకేకు స్నేహ బంధం ఉందని వ్యాఖ్యానిస్తూ, తమ కూటమిలోకి వచ్చే పార్టీలకు 64 సీట్లను మాత్రమే అందించగలమని, తామ అభ్యర్థులు మాత్రం 170 స్థానాల్లో పోటీ చేయడం తథ్యమని వ్యాఖ్యానించి పార్టీ వర్గాల్ని విస్మయంలో పడేశారు. విస్మయం : టీకేఎస్ ఇచ్చిన ఇంటర్వ్యూ డీఎంకేలో చర్చకు దారి తీసింది. అధిష్టానం ప్రకటించాల్సిన నిర్ణయాల్ని టీకేఎస్ వ్యాఖ్యానించడంతో పార్టీ కార్యాలయం వర్గాలు విస్మయం చెందాయి. టీకేఎస్ను వివరణ కోరుతూనే, ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చాటుకునే పనిలో డిఎంకే అధిష్టానం పడింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం అన్నా అరివాళయం నుంచి ఆగమేఘాలపై గురువారం ప్రకటన విడుదల అయింది. టీకేఎస్ ఇంటర్వ్యూతో పార్టీకి సంబంధం లేదని, అస్సలు ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా అధినేత వెల్లడిస్తారని, అయితే, పార్టీలో బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్లు ఇంటర్వ్యూల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అస్సలు ఆ ఇంటర్వ్యూలో అనేక అవాస్తవాలు ఉన్నాయని, దీనిని ఎవ్వరూ పరిగణించొద్దని సూచించారు. ఇక, అధిష్టానం ఆదేశాలు లేనిదే ఎవ్వరూ ఇంటర్వ్యూలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పార్టీ వర్గాలకు కరుణానిధి తీవ్ర హెచ్చరికలు చేసి ఉండటం గమనార్హం. -
‘మా’ కూటమి
సాక్షి, చెన్నై: వీసీకే, సీపీఐ, కాంగ్రెస్‌లు కలసి కట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. ఒకే కూటమిగా అవతరించాల్సిన అవశ్యం కూడా ఉందన్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా వీసీకే, సీపీఐ నేతలు సైతం వ్యాఖ్యానించడం బట్టి చూస్తే, త్వరలో కొత్త కూటమి ఆవిర్భవించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యంత బలహీనంగా ఉన్న పార్టీ కాంగ్రెస్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీని డీఎంకే అక్కున చేర్చుకుంటుందా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ సమయంలో ఒకరు తమను అక్కున చేర్చుకోవడం ఏమిటీ...? తామే కూటమి ఏర్పాటు చేస్తామన్నట్టుగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ప్రయత్నాల్లో పడ్డారు. ఇందుకు అద్దం పట్టే విధంగా డీఎంకేకు దూరంగా ఉన్న వాళ్లను అక్కున చేర్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా శుక్రవా రం సత్యమూర్తి భవన్లో జరిగిన ఓ వేడుకకు డీఎంకేకు దూరంగా ఉన్న వీసీకే నేత తిరుమావళవన్, సీపీఐ నాయకుడు సుబ్బరాయన్లను ఆహ్వానించారు. నేతలందరూ ఒకే వేదిక మీదకు రావడంతో ఆ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారన్న విషయం పక్కన పెట్టినా, నాయకులు రాజకీయాల్ని అందుకున్న కొత్త కూటమి ఆవిర్భావం లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. మా కూటమి: ఇక్కడ ఒకే వేదిక మీదకు సీపీఐ, వీసీకేలు , కాంగ్రెస్ రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. ఇక, 2004 ఎన్నికల పురాణం అందుకున్నారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్‌తో కలసి ఎన్నికల్ని ఎదుర్కొన్నాయని గుర్తు చేస్తూ, అధికార పగ్గాలు చేపట్టగానే ప్రజా సంక్షేమాన్ని కాంక్షించడం జరిగిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని అవినీతి పాలకులకు, పార్టీలకు చరమ గీతం పడాలంటే, ఒకే వేదిక మీదుగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. వీసీకే నేత తిరుమావళవన్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్, వీసీకే మధ్య భేదాభిప్రాయాలు అనేక విషయాల్లో ఉన్నాయని వివరించారు. అయితే, వాటన్నింటిని ఇప్పుడు మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మైనారిటీలకు పూర్తి భద్రత ఉండేదని, అయితే, ఇప్పుడు ఆ భద్రత కరువైందన్నారు. రాజకీయ స్వలాభం కోసం కాకుండా, ప్రజా సంక్షేమాన్ని, మైనారిటీల భద్రతను కాంక్షించే విధంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌తో పాటుగా అందరూ కలసి బీజేపీ పాలకులకు చరమ గీతం పడాల్సిన అవసరం ఉందని పిలుపు నివ్వడం గమనార్హం. ఇదే వ్యాఖ్యను సమర్థిస్తూ సీపీఐ నేత సుబ్బరాయన్ స్పందించడం విశేషం. -
చిదంబరం కన్నెర్ర
సాక్షి,చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూపు తగాదాలు రాజుకుంటున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంకు ఫిర్యాదు చేసి ఉన్నారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా ఈవీకేఎస్ ఇళంగోవన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గంతో ఢీ కొడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిన ఇళంగోవన్ గ్రూపు రాజకీయాలు సాగిస్తున్నారంటూ చిదంబరం వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ రెండు గ్రూపుల మధ్యసాగుతున్న వివాదంలో అధిష్టానం పెద్దలు జోక్యం కూడా చేసుకున్నారు. అయితే, ఫలితం శూన్యం. చిదంబరం వర్గానికి చెందిన పలువురు నాయకులకు పార్టీ నుంచి ఉద్వాసన పలుకుతూ ఈవీకేఎస్ తీసుకున్న నిర్ణయం వివాదాన్ని పెద్దది చేసింది. తన వర్గీయుల్ని అకారణంగా తొలగించడంపై చిదంబరం స్పందించారు. తమకు వ్యతిరేకంగా ఈవీకేఎస్ వ్యవహరిస్తున్న తీరుపై మళ్లీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే పనిలో చిదంబరం నిమగ్నం అయ్యారు. అధిష్టానం ద్వారా తమకు న్యాయం లభించని పక్షంలో తాడో పేడుకు రెడీ అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌కు చిదంబరం సైతం దూరం అయ్యారంటే, ఇక రాష్ర్టం లో ఆ పార్టీ భూస్థాపితమైనట్టే. రాష్ట్రంలో కొత్త పార్టీ దిశగా ఇది వరకు అడుగులు వేసిన చిదంబరం అధిష్టానం బుజ్జగింపులతో తలొగ్గిన విషయం తెలిసిం దే. అయితే, కొత్త పార్టీ ఏర్పాటు చేసి తీరాలన్న ఒత్తిడిని మద్దతుదారులు చిదంబరం మీద తెచ్చేపనిలో పడ్డారు. రాష్ట్రంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ వర్సెస్ చిదంబరం మధ్య వివాదం సాగుతుంటే, పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ నాయకులు రచ్చకెక్కారు. ఎంపీ కొత్త ఇయక్కం : పుదుచ్చేరి కాంగ్రెస్‌లో చీలికతో ఎన్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించి అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది. అక్కడి నేతల తీరుతో తాజాగా రాజ్య సభ సభ్యుడు కన్నన్ తిరుగు బావుటాకు సిద్ధం అయ్యారు. పుదుచ్చేరి కాంగ్రెస్ తరపున రాజ్య సభకు వెళ్లిన కణ్ణన్ గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా, నాయకులతీరును ఎండగట్టే రీతిలో స్పందిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన మక్కల్ మున్నేట్ర ఇయక్కంను ఏర్పాటు చేశారు. త్వరలో ఈ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చే అవకాశాలు ఎక్కువేనని ఆయన మద్దతు దారులు పేర్కొంటుండటం గమనార్హం. -
కాంగ్రెస్‌లో కార్తీ కలకలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌కు మరో తలనొప్పి ఎదురైంది. పార్టీలో కేంద్ర మాజీ మంత్రి పీ.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కల్లోలం సృష్టించాడు. మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్‌ను, పార్టీ వ్యవహారాలను విమర్శించాడు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సంజాయిషీ నోటీసు అందుకున్నాడు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంపై తగిన వివరణ ఇవ్వకుంటే అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ శుక్రవారం ప్రకటించారు. ఇటీవల సత్యమూర్తి భవన్లో జరిగిన కామరాజర్ గురించి మాట్లాడకుంటే కాంగ్రెస్ పార్టీనే లేదని ఇళంగోవన్ వెంటనే కార్తి మాటలను తిప్పికొట్టారు. కార్తీ వ్యాఖ్యలపై గందరగోళం నెలకొంది. కొందరు నిరసన నినాదాలతో ఆందోళన చేశారు. ఆగ్రహించిన కార్తీ చిదంబరం బలనిరూపణగా ‘ఐ 67’ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతం అయిన 1967 తరువాత జన్మించిన వారిని మాత్రమే అందులో సభ్యులుగా చేర్చుకున్నారు. ఐ 67కు సంబంధించిన సమావేశాన్ని గురవారం జరిపారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున సుమారు 234 మందిని కార్తీ పిలిపించారు. లౌకికపార్టీ అనే ప్రచారానికే పరిమితమైతే ఫలితం లేదు, ప్రజాకర్షణ కలిగిన కాంగ్రెస్ వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కార్తీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేగా సినిమా ప్రముఖులు వెంటపడటం మానుకోవాలని పరోక్షంగా నటి కుష్బును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అంతేగాక రాష్ట పార్టీ కార్యకలాపాలను సైతం విమర్శించారు. కార్తీకి నోటీసు : ఇళంగోవన్ నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి సందర్భంగా సత్యమూర్తి భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఇళంగోవన్ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్తీ చిదంబరం పార్టీ నియమావళికి విరుద్దంగా పోటీ సమావేశాన్ని నిర్వహించారని, అనేక విమర్శలు చేశారని మీడియాతో చెప్పారు. కామరాజనాడార్ గురించి మాట్లాడుకుంటే ప్రయోజనం లేదని వ్యాఖ్యానించాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు వివరణ కోరుతూ సంజాయిషీ నోటీసు జారీచేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన కార్తీని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదని పేర్కొన్నట్లు చెప్పారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.