డీఎంకేలో ‘టీకేఎస్’ కలకలం
వివాదాస్పద వ్యాఖ్యలు
సంబంధం లేదన్న అధిష్టానం
సాక్షి, చెన్నై : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధినేత ఎం కరుణానిధి ప్రయత్నాలకు ఎసరు పెట్టే విధంగా డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యలు సంధించారు. అధిష్టానం తుది నిర్ణయం తీసుకునేసినట్టుగా 170 నియోజకవర్గాల్లో బరిలో దిగుతున్నట్టు ప్రకటించి పార్టీలో కలకలం సృష్టించారు. ఈ వ్యాఖ్యలతో మేల్కొన్న డీఎంకే అధిష్టానం తమకు సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకోక తప్పలేదు.రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకునేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి వ్యూహాల్ని రచిస్తూ వస్తున్నారు. ఎలాగైనా తన నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటు లేదా, ఒంటరిగానైనా బరిలోకి దిగే విధంగా సమాలోచనలో ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో కరుణానిధి వ్యూహాలకు, ప్రయత్నాలకు ఎసరు పెట్టే విధంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యలు చేయడం డిఎంకే వర్గాల్లో కలకలాన్ని రేపాయి. అధినేత కరుణానిధి లేదా, కోశాధికారి ఎంకే స్టాలిన్ నోటి నుంచి కూడా ఇంత వరకు వెలువడని పార్టీ వ్యవహారాలకు సంబంధించిన వ్యాఖ్యల్ని టీకేఎస్ చేయడం చర్చకు దారి తీసి ఉన్నది. ప్రస్తుతం ఝలక్, షాక్‌లు ఇచ్చే పార్టీలు ఎన్నికల సమయంలో తప్పని సరిగా కలసి వస్తాయన్న ధీమాతో ఉన్న కరుణానిధికి టీకేఎస్ వ్యాఖ్యలు పెద్ద షాక్‌ను ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ప్రత్యేక ప్రకటన ద్వారా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
170 టార్గెట్ : పార్టీ అధికార ప్రతినిధిగా, పార్టీ ప్రధాన కార్యాలయ వ్యవహారాల కార్యదర్శుల్లో ఒకరుగా ఉన్న టీకేఎస్ ఇళంగోవన్‌కు డీఎంకేలో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అలాంటి నాయకుడు ఏకంగా పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలతో ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి చర్చల్లోకి ఎక్కారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 170 స్థానాల్లో పోటీ చేయనున్నదని ప్రకటించారు. గత ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేయడం వల్లే గెలుపు అవకాశాల్ని అనేక నియోజకవర్గాల్లో కోల్పోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కలిసి వస్తే 30 సీట్లలోపే ఇవ్వడం జరుగుతుందన్నారు.
జీకే వాసన్ ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో వాళ్లకు ఆ సీటే ఎక్కువ అంటూ పరోక్షంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీన పడిందని పేర్కొన్నారు. పీఎంకే, వీసీకేలు కుల పార్టీలు అని, కుల రాజకీయాలతో ముందుకు వెళ్తున్న ఈ పార్టీలను ఎవ్వరూ తమ తమ కూటముల్లోకి చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు.సీపీఎం, సీపీఐలను కలుపుకుని వెళ్తామని, వారితో డిఎంకేకు స్నేహ బంధం ఉందని వ్యాఖ్యానిస్తూ, తమ కూటమిలోకి వచ్చే పార్టీలకు 64 సీట్లను మాత్రమే అందించగలమని, తామ అభ్యర్థులు మాత్రం 170 స్థానాల్లో పోటీ చేయడం తథ్యమని వ్యాఖ్యానించి పార్టీ వర్గాల్ని విస్మయంలో పడేశారు.
విస్మయం : టీకేఎస్ ఇచ్చిన ఇంటర్వ్యూ డీఎంకేలో చర్చకు దారి తీసింది. అధిష్టానం ప్రకటించాల్సిన నిర్ణయాల్ని టీకేఎస్ వ్యాఖ్యానించడంతో పార్టీ కార్యాలయం వర్గాలు విస్మయం చెందాయి. టీకేఎస్‌ను వివరణ కోరుతూనే, ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చాటుకునే పనిలో డిఎంకే అధిష్టానం పడింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం అన్నా అరివాళయం నుంచి ఆగమేఘాలపై గురువారం ప్రకటన విడుదల అయింది. టీకేఎస్ ఇంటర్వ్యూతో పార్టీకి సంబంధం లేదని, అస్సలు ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా అధినేత వెల్లడిస్తారని, అయితే, పార్టీలో బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్లు ఇంటర్వ్యూల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అస్సలు ఆ ఇంటర్వ్యూలో అనేక అవాస్తవాలు ఉన్నాయని, దీనిని ఎవ్వరూ పరిగణించొద్దని సూచించారు. ఇక, అధిష్టానం ఆదేశాలు లేనిదే ఎవ్వరూ ఇంటర్వ్యూలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పార్టీ వర్గాలకు కరుణానిధి తీవ్ర హెచ్చరికలు చేసి ఉండటం గమనార్హం.
170 టార్గెట్!
Published Fri, Sep 4 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM
Advertisement
Advertisement