పంచముఖ పోటీ
Published Fri, Mar 25 2016 3:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ఎన్నికల్లో ఎట్టకేలకూ పంచముఖ పోటీ ఖరారైంది. గురువారం నాటి పరిస్థితులను బట్టీ ఐదు కూటములు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తేలింది. తమిళనాడు రాజకీయాలను అనేక దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలే శాసిస్తున్నాయి.1990 వరకు రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్యనే ద్విముఖ పోటీ సాగేది. దీంతో అన్నాడీఎంకే లేదా డీఎంకే ఏదో ఒకటి అధికారంలోకి రావడం ఖాయమనే నిర్ధారణకు ప్రజలు వచ్చేశారు. అయితే 1990 తరువాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. డీఎంకే నుంచి విడిపోయిన వైగో ఎండీఎంకేను పెట్టారు. ఆయన మరో బలమైన కూటమిని ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. అయితే అది నెరవేరలేదు.
అలాగే జీకే మూపనార్ నాయకత్వంలో కాంగ్రెస్ నుంచితమిళనాడు మానిల కాంగ్రెస్ పుట్టుకొచ్చింది. కొత్తగా రెండు పార్టీలు ఆవిర్భవించినా కొత్త పార్టీల ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఈ దశలో 2006లో విజయకాంత్ డీఎండీకేను స్థాపించారు. తమ పార్టీ అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆనాడు విజయకాంత్ ప్రకటించారు. అందుకు తగినట్లుగానే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. అయితే గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఆశించినవారిని భంగపరిచారు. తాజా ఎన్నికల్లో విజయకాంత్ డీఎంకే జత కడతారని గట్టిగా ప్రచారం జరిగింది.
అయితే పార్టీ సభలో ఒంటరిగా పోటీకి దిగుతున్నట్లు విజయకాంత్ ప్రకటించారు. మళ్లీ అకస్మాత్తుగా తన బాణీని మార్చుకుని రెండు రోజుల క్రితం ప్రజా సంక్షేమ కూటమిలో చేరిపోయారు. అంతేగాక ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమిచేత ప్రకటింపజేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మూడో కూటమి ఆవిర్భవించినట్లు ప్రచారం ప్రారంభం అయింది. ఇదిలా ఉండగా గతంలో తన తండ్రి కాంగ్రెస్‌లో విలీనం చేసిన తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) ను ఆయన తనయుడు జీకే వాసన్ గత ఏడాది పునరుద్దరించారు.
ఈ ఎన్నికల సమయంలో తామాకా ఏ పార్టీ దరిచేరకుండా, అలాగని ఒంటరి పోరని ప్రకటించకుండా కాలం గడుపుతోంది. ఒంటరి పోరని ప్రకటించిన డీఎండీకే సైతం ప్రజా సంక్షేమ కూటమిలో చేరిపోయిన ప్రస్తుత తరుణంలో పంచముఖ పోటీ ఖాయమనే అభిప్రాయం కలుగుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే, ప్రజా సంక్షేమ కూటమి మధ్యనే ప్రధానమైన పోటీ నెలకొనే అవకాశం ఉందని అంచనా. ఇక భారతీయ జనతా పార్టీ కొన్ని చిన్నపాటి పార్టీలతో కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక ఐదో పార్టీగా పీఎంకే అన్బుమణి రాందాస్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి అందరికంటే ముందుగా ఒంటరిగా రంగంలోకి దిగింది. సుమారు రెండు దశాబ్దాల తరువాత రాష్ట్రంలో పలుముఖ పోటీకి తెరలేచింది. పంచముఖ పోటీలో సీఎం అభ్యర్థులుగా జయలలిత, కరుణానిధి, విజయకాంత్, అన్బుమణి రాందాస్ రంగంలో ఉండగా బీజేపీ తనకూటమి తరఫున ఐదో సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
Advertisement
Advertisement