విశ్వనాయకుడు కమల్ హాసన్ సోమవారం పద్మభూషణాలంకృతులయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను...
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : విశ్వనాయకుడు కమల్ హాసన్ సోమవారం పద్మభూషణాలంకృతులయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను భారత ప్రభుత్వం ప్రతి ఏడాది భారత రత్న, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించడం ఆనవాయితీ. 2014వ ఏడాదికి గాను ఈ అవార్డులకు ఎంపికయిన వారిని గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది.
అందులో తమిళనాడుకు చెందిన వారు 8 మంది ఉన్నారు. వీరిలో సినీ కళారంగానికి చెందిన ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్, గీత రచయిత వైరముత్తు ఉన్నారు. వీరు సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు.
ఉత్తమ నటన, కళా సేవకుగాను కమల్ హాసన్‌ను అత్యుత్తమ పురస్కారం వరించింది. అదే విధంగా ఉత్తమ గీత రచనలు, సాహిత్య సేవలకుగాను వైరముత్తు ఈ పద్మభూషణ్ అవార్డును గెలుచుకున్నారు.