సీఎంపై పేపర్ బంతితో దాడి
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగించే సమయంలో ఒక వ్యక్తి బాంబ్...బాంబ్ అంటూ చేతిలోని పేపర్‌బంతిని విసరడం కలకలం రేపింది. చివరికి అతను తాగుబోతు అని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉదయభాను కళాసంఘం స్వర్ణోత్సవ సంబరాలు బెంగళూరులోని రవీంద్రకళాక్షేత్ర ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం సిద్ధరామయ్య ప్రసంగించడానికి వేదిక వద్దకు వెళ్లారు. ఈ సమయంలో ఆడిటోరియం మొదటి అంతస్తులోని ఓ వ్యక్తి...‘మీరు మా సమాజానికి ఏమి చేశారో మొదట చెప్పి ప్రసంగించాలి’ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ఆ వ్యక్తి ‘అంతా మీరే తింటున్నారు. మా కోసం ఏం చేశారో చెప్పేవరకూ నేను మిమ్మల్ని వదలను’ అంటూ చేతిలోని ఒక ఎర్రని వస్తువును బాంబ్..బాంబ్ అంటూ సీఎం ఉన్న వేదిక పైకి విసిరాడు. దీంతో కార్యక్రమంలో కలకలం చెలరేగింది. పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ వస్తువును పరీక్షించగా కొన్ని మాత్రలపై కాగితాలను గుండ్రంగా చుట్టి దానిపై చాక్లెట్ రాపర్స్‌ను అతికించినట్లు తేలింది. దీంతో పోలీసులతో పాటు వేదికపైనే ఉన్న కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్, పలువురు సాహితీవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. సిద్ధరామయ్యపై పేపర్ బంతితో దాడికి యత్నించిన వ్యక్తి బీబీఎంపీ అరణ్య విభాగం ఉద్యోగి ప్రసాద్ అని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిత్రదుర్గాలో మీడియాతో మాట్లాడుతూ...‘ఉద్దేశపూర్వకంగానే కొంతమంది ఈ దాడికి పాల్పడి ఉండటాన్ని కొట్టిపారేయలేం. అయినా ఇలాంటివన్నీ ప్రజాస్వామ్యంలో సాధారణం. మా ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి సమాన అవకాశాలు కల్పిస్తుంది’ అని అన్నారు.
కలకలం
Published Mon, Feb 22 2016 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement
Advertisement