న్యూఢిల్లీ: డీజిల్ రేట్లను లీటరుకు రూ. 4 నుంచి 5 తక్షణమే పెంచాలని కిరిట్ పారిఖ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. పారిఖ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తన నివేదికను బుధవారం ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నివేదికలో డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్‌లో ఏకరూప ధరల విధానాన్ని కొనసాగించాలని కమిటీ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డీజిల్ రేటును వెంటనే పెంచి, ఆపై మిగిలిన సబ్సిడీ భారాన్ని దించుకునేందుకు నెలకు లీటర్‌పై రూపాయి చొప్పున పెంచుతూ పోవాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. పెట్రోలు ఉత్పత్తుల ధరలను నియంత్రణలో ఉంచడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను కొనసాగించాలని తెలిపింది.