రిమ్స్ లో పార్కింగ్ దోపిడీ
రిమ్స్ లో పార్కింగ్ దోపిడీ
Published Tue, Sep 6 2016 11:14 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
ఆస్పత్రికి చెల్లించేది రూ.4వేలు..
కాంట్రాక్టర్‌కు రూ.లక్షలు
వాహనదారుల నుంచి రూ.10 చొప్పున వసూలు
పాతటెండర్‌పైనే మరొకరికి టెండర్ అప్పగింత
సినిమా టాకీస్‌లో వసూలు చేస్తలేరా.. : డెరైక్టర్ అశోక్
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రమైన రిమ్స్ ఆస్పత్రిలో పార్కింగ్ ఫీజు పేరిట దోపిడీ దందా యథేచ్ఛగా సాగుతోంది. రోగులు, వారి బంధువుల జేబులకు చిల్లు పడుతోంది. తీరా చూస్తే రిమ్స్ ఆస్పత్రికి రూ.4 వేలు మాత్రమే ఆదాయం వస్తోంది. కాని కాంట్రాక్టర్‌కు రూ.లక్షల్లో కాసుల వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి నిత్యం వందలాది రోగులు, వారి బంధువులు వాహనాలపై వచ్చి వెళ్తుంటారు. ఇటీవల ఎమర్జెన్సీ వార్డు ఎదుట పార్కింగ్ స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనానికి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. సమీపంలో వాహనాలు నిలుపకుండా కట్టుదిట్టం చేశారు. ప్రతి రోజు 300కు పైగా ద్విచక్ర వాహనాలు వచ్చి వెళ్తుంటారుు. ఈ లెక్కన సుమారు రోజుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పార్కింగ్ ఫీజు వసూలయ్యే అవకాశం ఉంది. ఇంత వసూలు చేస్తున్నా.. పార్కింగ్ కాంట్రాక్టర్ రిమ్స్‌కు చెల్లించేది ఎంతో తెలుసుకుంటే ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. నామామాత్రంగా నెలకు రూ.4 వేలు రిమ్స్‌కు చెల్లిస్తున్నారు. ‘‘నామినల్‌గా రూ.4 వేలు చెల్లిస్తున్నారు..’’అని రిమ్స్ డెరైక్టర్ అశోక్ నోటివెంటే రావడం గమనార్హం.
టెండర్ అప్పగింతలోనూ అనుమానాలే..
నెలకు రూ.4 వేల చొప్పున రిమ్స్‌కు చెల్లించే విధంగా పార్కింగ్ స్టాండ్ కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిమ్స్ అధికారులు.. అటు కాంట్రాక్టర్ మధ్య లోపారుుకారి ఒప్పందం ఉందేమోననే అనుమానాలు లేకపోలేదు. గత సంవత్సరం పార్కింగ్ స్టాండ్ కోసం టెండర్ పిలిచినట్లు రిమ్స్ డెరైక్టర్ చెబుతున్నారు. అందులో ఒక వ్యక్తి టెండర్ రూ.5 వేలకు అప్పగించగా.. ఆయన మూడు నెలలపాటే నిర్వహించి మూసివేశాడని, నిర్వహణ సాధ్యం కాలేదని అంటున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు పార్కింగ్ స్టాండ్ ఎవరూ నడుపలేదని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు మళ్లీ పార్కింగ్ స్టాండ్‌ను ప్రారంభించాలనుకుంటే పేపర్ ప్రకటన ఇచ్చి ఆసక్తి గల కాంట్రాక్టర్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలి. అలా కాకుండా అప్పట్లో రెండో స్థానంలో నిలిచిన కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని టెండర్‌ను కొనసాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
స్కూటరుంటే పేదవారు కాదట..!
‘రిమ్స్‌కు ద్విచక్ర వాహనంపై వచ్చే పేషెంట్లు, సంబంధీకులు పార్కింగ్ ఫీజు కింద రూ.10 కూడా చెల్లించుకోలేరా.. సినిమా టాకీస్‌లో రూ.20 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు.. సైకిల్ ఉన్నవారు పేదవారనుకోవచ్చు.. స్కూటర్ ఉన్నవారు కూడా పేదవారంటే ఎలా..?’ ఇదీ రిమ్స్ ఆస్పత్రిలో పార్కింగ్ ఫీజు రూ.10 విషయమై రిమ్స్ డెరైక్టర్ అశోక్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ఆయన ఇచ్చిన సమాధానం. బయట ఖరీదైన వైద్యం చేయించుకోలేక రిమ్స్‌కు వస్తున్నవారంతా సంపన్నులా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
Advertisement