‘మిషన్-2014’ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న పార్టీలు
Published Fri, Sep 27 2013 12:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, ముంబై: ‘మిషన్-2014’కు రాష్ట్రంలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. రోజురోజుకీ మారుతున్న రాజకీయ పరిణామాలపై దృష్టి కేంద్రీకరించిన అన్ని పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా మారడంతోపాటు 2014లో జరగబోయే ఎన్నికల కోసం వ్యూహరచన చేయడంలో ఇప్పటినుంచే నిమగ్నమయ్యాయి. పార్టీలను బలోపేతం చేయడంతోపాటు ప్రజాదరణ పొందేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించాయి. కొన్ని పార్టీలైతే అంతర్గత విభేదాలు, సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు మార్పులు చేర్పులు చేపడుతున్నాయి. సీట్ల పంపకాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఇవి ఆయా కూటములకు తలనొప్పిగా మారాయి. సాధ్యమైనంత మేర తమ కూటముల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను విడనాడి సీట్ల పంపకాలకు త్వరగా తెరదించాలనుకుంటున్నాయి. ప్రస్తుతం పితృపక్షం నడుస్తుండటంతో దసరా అనంతరం సీట్ల చిక్కుముడిని విప్పాలని ఆయా పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి.
పాతఫార్ములాతోనే మహా కూటమి పోటీ
మహాకూటమి లోక్‌సభ సీట్ల పంపకాలలో ఆర్‌పీఐకి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయం స్పష్టం కాకపోయినా, పాత ఫార్ములానే ఉంటుందని బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే స్పష్టం చేశారు. ‘గతంలో మాదిరిగానే బీజేపీకి 26, శివసేనకు 22 సీట్లు ఉంటాయి. అయితే వీటిలో నుంచి ఆర్‌పీఐకి ఎన్ని కేటాయించాలనేది ఆ పార్టీ అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలేతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. దసరా అనంతరం దీనిపై స్పష్టత వస్తుంద’ని తెలిపారు. ఈ విషయమై బుధవారం గోపీనాథ్ ముండే మాతోశ్రీకి వెళ్లి శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సమయంలో ఎలాంటి చర్చలు జరగలేదని, పాత ఫార్ములాతోనే ముందుకు వెళ్లనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నాలుగు లోక్‌సభ సీట్లు కావాలని, తొందరగా సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తి చేయకపోతే కూటమి నుంచి బయటకి వెళ్లనున్నట్టు రాందాస్ అథవాలే హెచ్చరికపై ముండే స్పందించారు. అలాంటిదేమి జరగదని, చర్చల ద్వారా అన్ని సమస్యలకు సమాధానం లభిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆర్‌పీఐకి సరైన న్యాయం జరుగుతుందని ఆయన హామీఇచ్చారు. భవిష్యత్‌లో కూడా మహాకూటమికి ఎలాంటి ఢోకా ఉండదని ఆయన పేర్కొన్నారు.
డీఎఫ్ కూటమిలో సైతం...
డీఎఫ్ కూటమిలో లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకాలపై వివాదాలు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎన్సీపీ నాయకులు పాత ఫార్ములతోనే (26-22) పోటీ చేస్తామని ప్రకటిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ మాత్రం కొత్త ఫార్ములాతో పోటీ చేస్తామని పేర్కొంటోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ 29 స్థానాల్లో పోటీ చేసి ఎన్సీపీకి 19 స్థానాలను ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ తాజాగా ఉండగానే పుణేలో పర్యటించిన రాహుల్‌గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలకు చేసిన హితబోధ డీఎఫ్ కూటమిలో కొత్త తలనొప్పులను తీసుకువచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఒంటరిగా బరిలోకి దిగాలన్న కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్ మేరకు అలాంటి అవసరం రాకుండా అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని ఆయన సూచించారు. అధిక సీట్లు కైవసం చేసుకుని ఎన్సీపీ అవసరం లేకుండా చూసుకోవాలన్నారు. దీనిపై రాబోయే రోజుల్లో ఎన్సీపీ నాయకులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.
ఒంటరిగానే ఎమ్మెన్నెస్...
శివసేనతోపాటు ఇతర పార్టీలకు పలు చోట్ల గట్టి పోటీ ఇస్తున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కూడా మిషన్ -2014కు సిద్ధమైంది. రాజ్‌ఠాక్రే అనేక ప్రాంతాల్లో పర్యటించి పదాధికారులు, కార్యకర్తల మనోబలాన్ని పెంచడంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలా? ఒంటరిగా బరిలోకి దిగాలా..? అనే విషయం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనలు రాలేదు. ఇప్పటివరకైతే ఒంటరి పోటీవైపే మొగ్గుచూపుతున్న ఎమ్మెన్నెస్ ఎన్నికల్లో తమ సత్తాచాటి వచ్చే ఎన్నికల్లో కింగ్‌మేకర్ పాత్రను పోషించాలని ఉబలాటపడుతోంది. మరోవైపు ఎమ్మెన్నెస్ పార్టీని కూడా మిత్రపక్షంగా చేర్చుకొని బరిలోకి దిగాలని బీజేపీ ప్రయత్నిస్తున్నా అది ఎంత మేరకు సఫలీకృతమవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
Advertisement
Advertisement