- కార్యకర్తలకు సీఎం సిద్ధరామయ్య పిలుపు
- రాయచూరు లోక్‌సభ అభ్యర్థి బీవీ.నాయక్ తరఫున ప్రచారం
- 11 నెలల కాలంలో ఎంతో అభివృద్ధి చేసి చూపాం
- బీజేపీని నమొద్దు
యాదగిరి, న్యూస్‌లైన్ : ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిం చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన యాదగిరి జిల్లాలోని షాపూర్, భీమరాయనగుడి పట్టణాలలో రాయచూరు లోక్‌సభ అభ్యర్థి బీవీ.నాయక్ తరఫున ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బహిరంగ సభ, కార్యకర్తల సమావేశంనుద్దేశించి మాట్లాడారు.
మతతత్వ బీజేపీ, ఏకనాయకత్వంపైనే నమ్మకం పెట్టుకున్నారని, అయితే కాంగ్రెస్ లౌకిక పార్టీ అని, మైనార్టీలు, దీన, దళిత, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కొప్పళ, రాయచూరు, గుల్బర్గా, బీదర్ సహా అన్ని లోక్‌సభ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు శాయశక్తులా కృషి చేయాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త మోడీ ధనవంతుడని, అందుకే ఆయనను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిందని అన్నారు.
2002లో గుజరాత్‌లో గోద్రా నరమేధంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీపై మాజీ మంత్రి రాందాస్ చేసిన వ్యాఖ్యలను సిద్ధు ఖండించారు. ప్రధాని పదవి వ రించినా ఆమె సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేశారు. అలాంటి నాయకురాలిపై ఆరోపణలు చేసే నైతికత బీజేపీ నాయకులకు లేదన్నారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలు మాజీ మంత్రి రాందాస్‌పై ఉన్నాయని, ఆయన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి అవసరం లేదన్నారు.
కోబ్రా పోస్ట్ సంస్థ కార్యాచరణ వెనుక ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ హస్తం ఉందన్నారు. తాను రైతు సంఘం పోరాటం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించానని, అందువల్ల రైతులపై చులకనగా మాట్లాడే వ్యక్తిత్వం కాదన్నారు. ఆరభావికి చెందిన రైతు విఠల్ విషం తాగి మరణించాడని, అతను విషం తాగడానికి ప్రభుత్వం కారణం కాదని మాత్రమే తాను వ్యాఖ్యానించానని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే కిలో బియ్యం పథకం, బడిపిల్లలకు పాలు, రైతుల రుణాల మాఫీ, అహింద వర్గాలకు వడ్డీతో సహా రుణాల మాఫీ చేశామన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆర్టికల్-371 కు సవ రణ చేశామన్నారు. ఇప్పటికే రూ.1600 కోట్ల బడ్జెట్‌ను కేటాయించామన్నారు. కేవలం 11 నెలల్లో రాష్ట్రంలోని పేదల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత ఆరేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన సాధన ఏమిటో చెప్పాలన్నారు. ముస్లిం మైనార్టీలపై మొసలి కన్నీరు కార్చుతున్న బీజేపీని నమ్మరాదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బీవీ.నాయక్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి శివనగౌడ నాయక్‌పై చట్టప్రకారం కేసు నమోదైందన్నారు.
శివనగౌడ మాటలు పట్టించుకోకుండా ప్రజల కష్టనష్టాలపై స్పందించి బీవీ.నాయక్‌కే ఈసారి ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని సీఎం కోరారు. మాజీ మంత్రి ఇబ్రహీం, మంత్రి బాబురావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో రాజా వెంకటప్ప నాయక్, డాక్టర్ ఏబీ మాలకరెడ్డి, అల్లమ ప్రభు పాటిల్, మరిగౌడ హులికల్, చంద్రశేఖర్ ఆర్.బోళ, మాజీ మంత్రి శరణబసప్పగౌడ దర్శనాపూర్, డాక్టర్ బసవరాజ్ ఇజేరి, సురపుర, షాపూర్‌లతో పాటు జిల్లాకు చెందిన వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.