ప్రశ్నించే తత్వమేదీ?: పవన్
సాక్షి, అమరావతి: ‘ఇండియాది ఉదాసీన సమాజం. పక్కవాడికి అన్యాయం జరిగితే ప్రశ్నించి, ఎదిరించే తత్వం కొరవడింది. ఏదో చేయాలన్న తలంపు. ఆలోచనలున్నా.. అవి కేవలం సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలకు మాత్రమే పరిమితమవుతున్నాయి’ అని సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అమెరికా పర్యటనలో వ్యాఖ్యానించారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు.
ఒకరు చెప్పేది తప్పని చెప్పడం సులువేనని, కానీ ఆయా సమస్యలు, సామాజిక రుగ్మతలపై వాస్తవంగా పోరాటానికి ముందుకొస్తున్నది ఎంత మంది అని ప్రశ్నించారు. తన వరకు తాను భావితరాల కోసం సాధ్యమైనంత చేయాలనే తలంపుతో ఉన్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై సెమినార్‌లో సభికులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. ప్రస్తుత పాలకులు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాల్సిందేనన్నారు. హామీ నుంచి ఎందుకు వెనక్కి తగ్గారో పాలకులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.