కరెంటు కొనుగోలు చార్జీలు తగ్గించండి
ప్రభుత్వానికి డిస్కమ్‌ల లేఖ
రేట్లు అధికంగా ఉన్నాయని ఆరోపణ
తగ్గిస్తే బిల్లులపై రాయితీ ఇస్తామని ప్రతిపాదన
న్యూఢిల్లీ: విద్యుత్ వినియోగదారులకు బిల్లులపై 10 శాతం రాయితీని కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ కరెంటు సరఫరా కంపెనీలు (డిస్కమ్‌లు) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయి. తాము ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసే కరెంటు రేట్లను తగ్గిస్తే బిల్లులపై రాయితీలు ఇస్తామని డిస్కమ్‌లు చెబుతున్నాయి. చార్జీలు తగ్గించాలంటూ టాటా పవర్స్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్) ఫిబ్రవరి నుంచి కేంద్ర విద్యుత్‌శాఖపై ఒత్తిడి పెంచుతోంది.
తాము ప్రస్తుతం కొన్ని గ్యాస్, థర్మల్ విద్యుత్‌ప్లాంట్ల నుంచి అధిక ధరలకు కరెంటు కొనుగోలు చేస్తున్నాం కాబట్టి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సవరించాలని కోరుతోంది. ప్రస్తుతం టీపీడీడీఎల్ యూనిట్ విద్యుత్‌ను రూ.5.66 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఈ కంపెనీ ప్రతిపాదనకు కేంద్ర విద్యుత్‌శాఖ అంగీకరిస్తే ధర రూ.5.10కి తగ్గుతుంది. ఫలితంగా వినియోగదారులకు భారం కాస్త తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
నష్టాలు తెచ్చిపెడుతున్న రాజ్‌ఘాట్ పవర్‌హౌస్, ఇంద్రప్రస్థ గ్యాస్ టర్బైన్‌స్టేషన్ల వంటి విద్యుత్ ప్లాంట్లను మూసివేయాలని మరో డిస్కమ్ బీఎస్‌ఈఎస్ ప్రభుతవానికి సూచించింది. వీటిలో కొన్నింటిని అరావళి/బవానా ప్రాంతాలకు తరలిస్తే విద్యుత్ ఉత్పత్తి పెరగడంతోపాటు తక్కువ రేట్లకు కొనుగోలు చేయడం సాధ్యపడుతుందని బీఎస్‌ఈఎస్ డెరైక్టర్ గోపాల్ సక్సేనా ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఈ పాంట్లకు నిర్దేశించిన ఇంధన ఒప్పందాలను అరావళి, బవానా ప్లాంట్లకు బదిలీ చేస్తే టారిఫ్‌ను 5-7 శాతం తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి వ్యయాలను హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని రిలయన్స్ అధీనంలోని డిస్కమ్‌లు బీఆర్‌పీఎల్, బీవైపీఎల్ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నాయి. రేట్లను సవరిస్తే డిస్కమ్‌లు రూ.770 కోట్ల వరకు ఆదా చేయవచ్చని తెలిపాయి. ఫలితంగా కరెంటు బిల్లులపై ఏడు శాతం వరకు రాయితీ ఇస్తామని ఈ రెండు బీఆర్‌పీఎల్, బీవైపీఎల్ అధికారులు ప్రకటించారు.