హౌసింగ్ శాఖకు దిక్కెవరు?
డిప్యుటేషన్‌పై ఇతర శాఖలకు ఏఈలు, కార్యాలయాలకు తాళాలు
పెండింగ్ బిల్లుల కోసం తిరుగుతున్న లబ్ధిదారులు
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపైనే పేదల ఆశలు
యాచారం: గృహ నిర్మాణ శాఖ దిక్కు లేకుండా తయారైంది. బాధ్యులైన ఏఈలు డిప్యుటేషన్‌పై వెళ్లారు. రూ. లక్షలు ఖర్చు చేసిన ఆ శాఖ కార్యాలయాలు నేడు తాళాలు పడి దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరైన రోజుల్లో ఒక వెలుగు వెలిగిన హౌసింగ్ శాఖ నేడు దిక్కే లేకుండా పోవడంతో ఇక ఈ ప్రభుత్వంలో ఇంటి నిర్మాణాలు కలగానే మిగులుతాయని పేద ప్రజలు అయోమయంలో పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో పేదల్లో ఆశ పెరిగింది. నేడు హౌసింగ్ శాఖనే ఎత్తేసే పరిస్థితి నెలకొనడంతో తమ కలల సౌధాల కోసం ఎదురుచూసే పేదలు పరిస్థితి నేడు నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించుకున్న ఇళ్లకు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు, కనీసం లబ్ధిదారుల ఎంపిక సైతం ముందుకు సాగకపోవడంతో పేదల్లో అసంతృప్తి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి మండలంలో హౌసింగ్ శాఖ మోడల్ గృహాలను నిర్మించి ప్రభుత్వ సహయం చేసే నిధులతోనే చక్కటి ఇంటిని నిర్మించుకోవచ్చనే భావన ప్రజల్లో కల్పించేలా కృషి చేసింది. మోడల్ గృహాలను నిర్మించిన తర్వాత నేటి తెలంగాణ ప్రభుత్వంలో ఆ శాఖలో పనిచేస్తున్న ఏఈలను, ఇతర సిబ్బందిని ఇతర శాఖలకు డిప్యుటేషన్‌పై పంపింది.
మండల స్థాయిలో పర్యవేక్షణ చేసే ఏఈలు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో కార్యాలయాలు దిక్కు లేకుండా పోయాయి. కార్యాలయాల్లో రికార్డులకు సైతం భద్రత లేదు. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో గృహ నిర్మాణ పనులను పర్యవేక్షణ చేయడానికి ప్రభుత్వం మంచాల ఏఈ రాంచంద్రయ్యను నియమించింది. ఆయన కూడా తన విధులకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ఏదో తూతూ మాత్రంగా విధులు నిర్వర్తిస్తూ వస్తున్నాడు. ఆయన కూడా త్వరలో ఏదో ఒక శాఖకు బదిలీపై వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు.
రూ. 50 లక్షల పెండింగ్ బిల్లులు
ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో దాదాపు 150 మంది లబ్ధిదారులకు రూ. 50 లక్షల వరకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ బిల్లులున్నట్లు సమాచారం. ఈ బిల్లులు కూడా 2014 జనవరికి ముందు ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో నిర్మించుకున్నవి మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకం కింద అనుమతులు పొంది తెలంగాణ ప్రభుత్వంలో ఆయా మండలాల్లో వందలాది మంది ఇంటి నిర్మాణాలను చేపట్టడం జరిగింది. మొదట్లో తెలంగాణ ప్రభుత్వం పేదలందరికీ బిల్లులు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చి ఆయా మండలాల తహసీల్దార్ల ద్వారా నిజమైన లబ్ధిదారుల సర్వే కూడా చేయించింది. తహసీల్దార్ సర్వేతో ఇక తమకు ఇంటి నిర్మాణ బిల్లులు వస్తాయని కలలు కన్న పేదలు నేడు బిల్లులు మంజూరు కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారంతా నిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. అప్పట్లో అప్పలు చేసి ఇంటి పనులు ప్రారంభించుకున్నారు. నేడు ఆ నిర్మాణాలకు సంబంధించి బిల్లులు రాకపోవడం, చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక అల్లాడిపోతున్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిస్థితి కూడా ముందుకు సాగే పరిస్థితి లేకపోవడంతో ఇక తమకు ఇంటి మంజూరు కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొందని పేదలు అంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్ బిల్లులు వచ్చేలా, త్వరలో డబుల్‌బెడ్‌రూం ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కృషి చేయాలని పేదలు కోరుతున్నారు. ఇదే విషయమై హౌసింగ్ ఇన్‌చార్జి రాంచంద్రయ్యను సంప్రదించగా తామే అయోమయంలో ఉన్నామని అన్నారు. దిక్కే లేకుండా పోయిందని వాపోయా రు. తాను కూడా ఇతర శాఖలోకి వెళ్లేం దుకు చూస్తున్నానని చెప్పుకురావడం కొసమెరుపు.