- వెల్లడించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి
- హర్షం వ్యక్తం చేసిన సీఎం ఫడ్నవీస్
ముంబై: గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ‘గో వధ నిషేధ బిల్లు’కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. ‘రాష్ట్రపతి బిల్లును ఆమోదించినందుకు సంతోషంగా ఉంది. బిల్లు గురించి చాలా ఏళ్లుగా గట్టిగా ప్రయత్నిస్తున్నాం. జంతువుల రక్షణ కోసమే కాకుండా వ్యవసాయాన్ని బతికించడానికి కూడా ఈ బిల్లు ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉన్న జంతువులను కూడా డబ్బు కోసం చంపేవారు. ఇప్పుడు దాన్ని ఆపేస్తారు’ అని ఆయన చెప్పారు.
బిల్లు ఆమోదంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ‘మహారాష్ట్ర జంతు సంరక్షణ బిల్లును ఆమోదించినందుకు ధన్యవాదాలు. గో వధ నిషేధాన్ని రాష్ట్రంలో ఆమలు చేయాలనే మా కల నేటికి నెరవేరింది’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన ఏడుగురు బీజేపీ ఎంపీలు కిరీట్ సోమయ్య నేతృత్వంలో రాష్ట్రపతిని న్యూఢిల్లీలో కలసి బిల్లు ఆమోదించాలని వినతి పత్రం సమర్పించారు. ‘మహారాష్ట్ర జంతు సంరక్షణ (సవరణ) బిల్లు- 1995ను శివసేన- బీజేపీ ప్రభుత్వం పాస్ చేసింది. అయితే గత 19 ఏళ్లుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది’ అని వినతి పత్రంలో పేర్కొన్నారు
గోవధ నిషేధ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం
Published Mon, Mar 2 2015 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement