అట్టహాసంగా ‘కరుణ’ బర్త్‌డే వేడుకలు
చెన్నై: డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి పుట్టినరోజు వేడుకలు తమిళనాట ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన రెండు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఒకటి 94వ జన్మదినం కాగా మరొకటి శాసనసభ్యునిగా 60 ఏళ్లు పూర్తయిన సందర్భం కావటం గమనార్హం. చెన్నై నగరం గోపాలపురంలోని ఆయన నివాసాన్ని రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించారు.
శనివారం ఉదయం ఆయనను కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన స్టాలిన్‌తోపాటు పలువురు ప్రముఖులు కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన వేడుకలకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టీఎంసీ ఎంపీ డెరెక్ ఒ బ్రియాన్‌తోపాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు.
మరోవైపు వజ్రోత్సవ వేడుక సందర్భంగా కరుణానిధి దర్శనం ఇస్తారన్న ఆశతో ఉన్న పార్టీ వర్గాలకు నిరాశే మిగిలింది. ఆయన వజ్రోత్సవ వేడుకలకు దూరంగా గోపాలపురం ఇంటికే పరిమితం అయ్యారు. వైద్యులు సూచన మేరకు మరికొంత కాలం కరుణానిధికి విశ్రాంతి అవసరం అని, ఇన్ఫెక్షన్ సమస్యలు మళ్లీ తలెత్తకుండా ఉండాలంటే ఆయనను ఎవ్వరూ కలవకుండా ఉండడమే మంచిదన్న సూచనను వైద్యులు సూచించారు. దీంతో పార్టీ ఓ అధికారిక ప్రకటన చేసింది. తన జన్మదినం వేళ అందరి ముందుకు కరుణానిధి వస్తారని భావించామని అయితే, వైద్యుల సూచన మేరకు తుది నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది.
కాగా కరుణానిధికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తిరుచిరాపల్లి జిల్లా కలిదలై నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆయన మొదటి సారిగా 1957లో అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆయన ఒక్క ఓటమి కూడా లేకుండా అప్రతిహతంగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న ఏకైక నేతగా ఘనత సాధించారు.