బెంగళూరు నగరంలో మెట్రోలో ప్రయాణికుల రద్దీ దృశ్యాలు
బొమ్మనహళ్లి: నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాల్లో నలిగిపోతున్న వాహనదారులను, ప్రజలను మెట్రో రైళ్లు జోరుగా ఆకర్షిస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల బెడద లేకుండా, గంటలకొద్దీ స్తంభించిపోతున్న ట్రాఫిక్‌కు నివారణగా వచ్చిన మెట్రో రైలు నగరవాసులకు వరదాయిని అనడంలో ఎలాంటి సందేహం లేదు. పది నిమిషాలకో రైలు, నిముషాల్లోనే గమ్యస్థానం చేరుకోవడం లాంటి వెసులుబాట్లు రా రమ్మంటుండడంతో నగరవాసులు మెట్రో రైళ్ల వైపు పరుగులు తీస్తున్నారు.
ఇటీవలి కాలంలో కార్లలో ఆఫీసులకు వెళ్లే టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సైతం మెట్రో రైళ్లలోనే ప్రయాణానికి మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు నైరుతి రుతుపవనాలకు ముందస్తుగా గత రెండు, మూడు వారాలుగా సాయంత్రం పూట పడుతున్న వానల వల్ల కూడా మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇటీవలి వరకు రోజూ మూడు లక్షలా 60 వేల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుంటే, ఇప్పుడా సంఖ్య నాలుగు లక్షలను దాటుతోంది.
రద్దీతో తప్పని అవస్థలు
ఈ అనూహ్య రద్దీతో, ముఖ్యంగా సాయంత్రం పూట అమ్మాయిలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధుల సంగతి సరేసరి. రైల్లోకి ఎక్కడం కూడా కష్టమే. ఇక సీట్లు దొరకవు, కనీసం నిలబడడానికి కూడా స్థలం కరువే. వీరంతా రద్దీ తగ్గేంతవరకు ఎదురుచూడాల్సి వస్తోంది. కెంపేగౌడ స్టేషన్‌లో అయితే వచ్చే, పోయే రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కెంపేగౌడ స్టేషన్ వచ్చినప్పుడు, మెట్రో రైళ్ల నుంచి దిగే ప్రయాణికులను చూస్తే చీమల దండు గుర్తుకు వస్తుంది. దీని వల్ల టాప్‌టాప్‌లు, బ్యాక్‌ప్యాక్‌లతో వచ్చే ప్రయాణికులు నిలబడడానికి చోటు లేక అవస్థలు పడుతుంటారు. తమ కాళ్ల సందుల్లో వాటిని భద్రంగా ఉంచుకుని, తోసుకొచ్చే ప్రయాణికుల నుంచి వాటిని కాపాడుకోవడానికి తంటాలు పడాలి.
అదనపు బోగీలు ఎక్కడ?
పెరుగుతున్న రద్దీని తట్టుకోవడానికి వీలుగా మార్చి నుంచి రైళ్లకు అదనపు బోగీలను సమకూర్చుతామని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ జనవరిలో హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ అమలును జూన్ వరకు వాయిదా వేయడంతో ప్రయాణికులు మరికొన్ని రోజుల పాటు మెట్రో రైళ్లలో కుస్తీలు పడక తప్పేట్లు లేదు.
Comments
Please login to add a commentAdd a comment