విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి | permission should be for the triumph rally | Sakshi
Sakshi News home page

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి

Published Thu, May 15 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

permission should be for the triumph rally

 ముంబై: ఎన్నికల నియమావళి ఇంకా అమలులోనే ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జాయింట్ పోలీస్ కమిషనర్ ధనుంజయ్ కమలేకర్ తెలిపారు. ఆరు లోక్‌సభ స్థానాల లెక్కింపుకోసం కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతా వివరాలను గురువారం ఆయన మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సాయుధులైన ముంబై పోలీసులతోపాటు, పారా మిలటరీ బలగాలు, సీఆర్‌పీఎఫ్ బలగాలు కూడా భద్రతలో పాలుపంచుకుంటున్నాయి. లెక్కింపు కేంద్రాల దగ్గర మొదటి వరుసలో సీఆర్‌పీఎఫ్ బలగాలు, తరువాత రాష్ట్ర రిజర్వు పోలీసులు, ఆ తరువాత ముంబై పోలీసులు.. ఇలా మూడు అంచెల భద్రత ఉంటుంది. ఇదే కాకుండా నగరవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

 ఐదుగురు అదనపు పోలీస్ కమిషనర్లు, 22మంది డిప్యూటీ పోలీస్ కమిషనర్లు, 14 మంది అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, 67గురు ఎస్సైలు విధుల్లో పాల్గొంటున్నారు. నగర పోలీసులతోపాటు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర భద్రతా బలగాలు, రాష్ట్ర భద్రతా బలగాలు కూడా ఉంటాయి. లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అవాంతరాలు జరగకుండా వ్యూహాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.

ఉత్తర ముంబై, ఉత్తర మధ్య ముంబై, వాయవ్య ముంబైల స్థానాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను గోరేగావ్ సబర్బన్‌లోని ముంబై ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసినట్టు, ఈశాన్య ముంబై స్థానానికి గాను విఖ్రోలీ సబర్బన్‌లోని ఉదయచల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాట్లు జరిగాయని కమలేకర్ వివరించారు. దక్షిణ మధ్య ముంబై స్థానానికి మాటుంగాలోని రూపరేల్ కాలేజీలో, దక్షిణ ముంబై స్థానానికి పరేల్‌లోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీలో లెక్కింపు జరుగుతుందని తెలిపారు. అన్ని కేంద్రాల్లో మూడంచెల భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి వాహనాలను నిలపవద్దని, పార్టీల మధ్య ఎలాంటి గొడవలు తలెత్తకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశామని పోలీసు అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement