
వియ్యంకుడి అప్పుతో రజనీకి తిప్పలు
ఆవేదనలో సూపర్‌స్టార్
డబ్బు కాజేసేందుకు కుట్రని ఆరోపణ
మద్రాసు హైకోర్టులో రజనీకాంత్
పిటిషన్
చెన్నై, సాక్షి ప్రతినిధి:వెండితెరపై అందరి కష్టాలు తీర్చే హీరోగా పేరుగాంచిన సూపర్‌స్టార్ రజనీకాంత్ నిజజీవితంలో తానే కష్టాల్లో పడ్డాడు. ‘ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’ అని నిఖార్సుగా పలికే రజనీ పదేపదే సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులను వరుసగా ఎదుర్కొంటున్నాడు. కోలివుడ్ సూపర్‌స్టార్‌గా పేరుగాంచినా వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కలిగిన ధ్రువనక్షత్రంగా రజనీ పేరుగాంచారు. ఒకప్పుడు ఎంజీ రామచంద్రన్ సాధించిన ఫాన్ ఫాలోయింగ్‌ను నేడు రజనీకాంత్ ఆస్వాదిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో
ఆవేదనలో రజనీ
హిట్లు కంటే వివాదాలే ఎక్కువగా ఆయనను చుట్టుముట్టుతున్నాయి. మూడేళ్ల క్రితం వచ్చిన రోబో తరువాత రజనీ సినిమాలేవీ రాణించలేదు. ఇందుకు తోడు ఆర్థిక వివాదాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రజనీ హీరోగా కుమార్తె సౌందర్య దర్శకత్వంలో విడుదలైన కొచ్చడయాన్ యానిమేషన్ చిత్రం ప్లాప్ అయింది. అంతేగాక ఆ చిత్ర నిర్మాత ఒక ఫైనాన్సర్ నుంచి అప్పు తీసుకునేందుకు రజనీ భార్య తన ఆస్తులను తనఖా పెట్టిందనే వార్తలు వచ్చాయి. సినిమా దె బ్బతినడం వల్ల తాను, కుమార్తె, భార్య అందరూ బాధపడాల్సి వచ్చిందని రజనీ ఆవేదనకు గురైనారు. ఈ వివాదం నుండి తేరుకోక ముందే లింగా విడుదలై భారీ పరాజయం పాలు కావడం రజనీని కృంగదీసింది. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు సొమ్మును తిరిగిచ్చే సంప్రదాయం (బాబా సినిమాతో) ప్రారంభించిన రజనీ మెడకు మళ్లీ చుట్టుకుంది. లింగా వల్ల నష్టపోయిన సొమ్మును నిర్మాత చెల్లించాలని, ఇందుకు రజనీకాంత్ చొరవతీసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు రోడ్డెక్కారు. ఒక దశలో రజనీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. లింగా అగ్గి ఇంకా చల్లారక ముందే మరో వివాదం రజనీ మానసిక స్థితిని అల్లకల్లోలం చేసింది. మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసేలా చేసింది.
తాజాగా మరో వివాదం:
హీరో ధనుష్ రజనీకాంత్ అల్లుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ధనుష్ తండ్రి, సినీ దర్శకుడు కస్తూరీరాజా 2012లో చేసిన అప్పు రజనీకాంత్‌ను మరోసారి వివాదాల్లో లాగింది. చెన్నైకి చెందిన ఫైనాన్షియర్ ముకున్ చంద్ బోత్రా 2012లో కస్తూరీరాజాకు రూ.65 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అప్పుతీసుకునే క్రమంలో రజనీకాంత్‌ను పూచికత్తుగా పెట్టినట్లు ముకున్ చంద్ చెబుతున్నాడు. ఒక వేళ తాను అప్పు చెల్లించలేని పక్షంలో తన కుమారుడు ధనుష్ మామగారైన రజనీకాంత్ అప్పు తీరుస్తాడని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. అప్పుకు చెల్లింపుగా కస్తూరీరాజ్ ముకున్‌చంద్‌కు ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయి. ఇదే సమయంలో మే హూ రజనీకాంత్ అనే బాలివుడ్ చిత్రంపై నిషేధం విధించాలని రజనీకాంత్ కోర్టులో పిటిషన్ వేశాడు.
తన అనుమతి లేకుండా పేరును వాడుకునే హక్కు ఎవరికీ లేదని, అలా వాడుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని రజనీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చెక్కులు బౌన్స్ కావడం వల్ల తన అప్పు రాబట్టుకునేందుకు బాలివుడ్ సినిమాపై రజనీ వేసిన పిటిషన్‌ను ముకున్‌చంద్ అవకాశంగా మలుచుకున్నాడు. అనుమతి లేకుండా పేరును వాడుకునే వారిపై చర్యలు తీసుకుంటానని రజనీ ప్రకటించినందున ఆయన వియ్యంకుడు కస్తూరీరాజాపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా రజనీని ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్ బుధవారం విచారణకు రాగా రజనీకాంత్ న్యాయవాది బదులు పిటిషన్ దాఖలు చేశారు. ముకున్‌చంద్ బోత్రాకు తనకు మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవని రజనీ పేర్కొన్నారు. తన నుండి అక్రమంగా డబ్బు రాబట్టుకునేందుకు పన్నిన పన్నాగమని అన్నారు. పిటిషన్‌దారుని వైఖరి తన పేరు, ప్రతిష్టలకు కళంకం తెచ్చేలా ఉందని, తను ఎంతో మనస్థాపానికి గురిచేసిందని ఆవేదన చెందారు. కస్తూరీ రాజాపై ముకున్ చంద్ గతంలో జార్జి టౌన్ పోలీసు స్టేషన్‌లో పెట్టిన కేసును కొట్టివేశారని చెప్పారు. దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా రజనీకాంత్ కోరారు. ఇరుపక్షాల వాదనను విన్న న్యాయమూర్తి రవిచంద్రబాబు, రజనీవాదనపై బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ కేసును నాలుగువారాలపాటూ వాయిదావేశారు.