న్యూఢిల్లీ: ఎక్కువ నాణ్యత గల కెమెరా, పెద్ద తెర, మంచి ఆప్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ చౌకధరకే ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడితే అనుమానించాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటివి కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దొంగిలించిన ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను ఆన్‌లైన్‌లో విక్రయించే పద్ధతి పెరుగుతోందని అంటున్నారు. Quikr.com, ebay.in, olx.in సైట్ల ద్వారా స్మార్ట్‌ఫోన్లను దొంగలు తక్కువ రేట్లకు అమ్ముతున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, సరికొత్త ఆప్స్, నాణ్యమైన కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్లకు భారీ డిమాండ్ ఉండడంతో దొంగలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
అధిక నాణ్యత గల స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే వస్తుంది కాబట్టి అది చోరీ అయినా ఫోనా కాదా అనేదాన్ని వినియోగదారులు పట్టించుకోవడం లేదని, కనీసం బిల్లులను కూడా అడగడం లేదని సదరు అధికారి వివరించారు. రూ.20 వేల ధర ఉండే ఫోన్లు ఈ సైట్లలో రూ.10 వేల లోపు దొరుకుతున్నాయి. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఆగస్టు 31 వరకు నగరవ్యాప్తంగా 6,945 స్మార్ట్‌ఫోన్లు అదృశ్యమయ్యాయి. ఉత్తర ఢిల్లీ పోలీసు జిల్లాలోనే 1,426 ఫోన్లు చోరీ అయినట్టు ఫిర్యాదు వచ్చాయి. నైరుతి ఢిల్లీలో ఫోన్ చోరీపై ఒకే ఫిర్యాదు అందింది.
అత్యధిక సంఖ్యలో వీఐపీలు, వీవీఐపీలు నివసించే న్యూఢిల్లీలో 298 స్మార్ట్‌ఫోన్లు అదృశ్యమయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలో 1,337, తూర్పుఢిల్లీలో 443 స్మార్ట్‌ఫోన్లు చోరీ అయ్యాయి. 2013లో 15,669 ఫోన్లు చోరీ అయ్యాయి. ఫోన్లు చోరీ అయినా పోలీసు స్టేషన్లకు వెళ్లి వినియోగదారులు ఫిర్యాదు చేయకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారని అధికారులు తెలిపారు. ఒకవేళ వినియోగదారుడు ఫిర్యాదు చేస్తే అతని ఫోన్ ఐఎంఈఐ(ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబరును ట్రాకింగ్ చేయడం ద్వారా అది ఎక్కడుందో గుర్తిస్తామని చెప్పారు. ప్రతి మొబైల్‌ఫోన్‌కు ప్రత్యేకమైన ఐఎంఈఐ సంఖ్య ఉంటుంది. పోలీసు స్టేషన్లలో ఉండే ట్రాకింగ్‌యంత్రం ఈ కోడ్ సాయంతో ఫోన్ ఉన్న ప్రదేశాన్ని కనిపెడుతుంది.
ఆన్‌లైన్‌లో దొంగ ఫోన్లు
Published Sun, Sep 7 2014 10:45 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement
Advertisement