
రేషన్ షాపులో ప్లాస్టిక్ బియ్యం
శ్రీరామనగర్: కొప్పళ జిల్లాలోని ఒక చౌక దుకాణంలో ప్లాస్టిక్ బియ్యం ఇచ్చారని లబ్ధిదారులు గొడవకు దిగారు. గంగావతి తాలూకా శ్రీరామనగర్ గ్రామంలోని 6వ వార్డులో ఉన్న చౌకడిపోలో గురువారం అన్నభాగ్య పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం బస్తాలలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు కలకలం రేగింది. చౌకడిపోలో బియ్యం తీసుకెళ్లిన కొందరు ఇంట్లో యథావిధిగా వండి చూశారు. అన్నంలో ఏదో తేడా రావడంతో ఇది ప్లాస్టిక్ బియ్యమే అయి ఉంటుందని చెప్పారు. అలాగే మరో గ్రామస్తుడు కూడా ఈ బియ్యం వండి చూడగా ప్లాస్టిక్ వాసన వస్తోందని తెలిపాడు. దీంతో ప్రజలు బియ్యం తీసుకొచ్చి ఆగ్రహం వ్యక్తంచేశారు.
పరీక్షలకు బియ్యం నమూనాలు
ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులను ప్రజలు, మీడియా ప్రశ్నించగా, బియ్యం నాణ్యతను పరిశీలించడానికి శ్యాంపిల్‌ను సేకరించి జిల్లా కేంద్రానికి పంపినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు ప్లాస్టిక్ బియ్యంను సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని పలువురు లబ్ధిదారులు ఆరోపించారు. ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.