రైతులకు ‘రుణ విముక్తి’ | Please forgive up to half | Sakshi
Sakshi News home page

రైతులకు ‘రుణ విముక్తి’

Published Tue, Aug 16 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

రైతులకు ‘రుణ విముక్తి’

రైతులకు ‘రుణ విముక్తి’

సగం వరకు మాఫీ చేయండి
కేంద్రాన్ని కోరిన సీఎం సిద్ధరామయ్య
మిగతా సగం మొత్తాన్ని మాఫీ చేసేందుకు   రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని ప్రకటన
స్వాతంత్య్ర సమర యోధుల పింఛన్ 20 శాతం పెంపు
మాణెక్ షా పరేడ్ గ్రౌండ్స్‌లో   అంబరాన్నంటిన  స్వాతంత్య్ర సంబరాలు

 

బెంగళూరు: రాష్ట్రంలోని రైతులు జాతీయ బ్యాంకుల్లో రూ.29 వేల కోట్ల వరకు అప్పులు చేశారని, ఇందులో సగం మొత్తాన్ని మాఫీ చేసేందుకు కేంద్రం ముందుకు రావాలని సీఎం సిద్ధరామయ్య కేంద్రాన్ని కోరారు. ఆ మిగతా సగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా మాఫీ చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. నగరంలోని మాణెక్ షా పెరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం జరిగిన 70వ స్వాతంత్య్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మాణెక్ షా పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అన్నభాగ్య పథకంలో భాగంగా ఇప్పటి వరకు బీపీఎల్ కుటుంబాలకు అందజేస్తున్న బియ్యాన్ని మరో కేజీ అదనంగా అందజేయడంతో పాటు సబ్సిడీ ధరలో కేజీ కందిపప్పును అందజేయాలన్న ఆలోచన  ఉందన్నారు. బెంగళూరు నగర జిల్లాలో గత మూడేళ్లుగా 52 వేల కోట్ల రూపాయల విలువ చేసే 4950 ఎకరాల ఆక్రమిత భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని తెలిపారు.


నగరంలోని రాజకాలువల ఆక్రమణలను పూర్తిగా తొలగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృఢమైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అక్రమాల్లో భాగస్వాములైన బిల్డర్లు, వారికి సహకారం అందించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నామని ప్రకటించారు. ఇక నమ్మ మెట్రో మొదటి దశ పనులను ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఇప్పటికే మెట్రో రెండో విడత పనులు ప్రారంభమయ్యాయని, మూడో విడత పనులకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. నగరంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను గత రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి నగరస్థాన పథకంలో భాగంగా రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. ఇక క్షీర భాగ్య పధకంలో భాగంగా రాష్ట్రంలోని 1.08 కోట్ల మంది చిన్నారులకు వారంలో ఐదు రోజుల పాటు ఒక్కొక్కరికి 150 మిల్లిలీటర్ల చొప్పున వెన్నతో కూడిన పాలను అందజేస్తున్నామన్నారు.

 

ఆందోళన కలిగించే అంశం....
ఇక ఇటీవలి కాలంలో దేశంలో దళితులు, మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ విషయం అత్యంత ఆందోళన కలిగిస్తోందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర సమరం తరహాలోనే పోరాటాన్ని సాగించాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను సమాజానికి అంటుకున్న ఓ కళంకమని పేర్కొన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, మతవాదాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement