= ప్రమాద బాధితులకు సాయం చేయండి
= ముఖ్యమంత్రి సాంత్వన‘హరీష్ యోజన’ను ప్రారంభించిన సీఎం
= ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు
= తన కుమారుడి పేరుతో పథకం ప్రారంభించడం సంతోషదాయకం : హరీష్ తల్లి గీత
బెంగళూరు : తాను చావు బతులకు మధ్య ఉన్నానని తెలిసి తన అవయవాలను మరొకరికి దానం చేయాలని చివరి కోరికగా అసమాన స్ఫూర్తి ప్రదర్శించిన ‘హరీష్’ పేరుతో పథకం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడి విధాన సౌధలో ముఖ్యమంత్రి సాంత్వన‘హరీష్ యోజన’ పథకాన్ని ప్రారంభించి మాట్లాడుతూ... హరీష్ మరణం దురదృష్టకరమైనా ఆయన స్ఫూర్తి అజరామరమన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు మాకెందుకులే అంటూ ప్రజలు భావించకుండా తక్షణ సాయం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల సందర్భంలో బాధితులకు ఉపయుక్తంగా ఉండేలా రూపొందించిన ముఖ్యమంత్రి సాంత్వన‘హరీష్ యోజన’ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ పథకంలో ఉన్న ముఖ్యమంత్రి పేరును తీసేస్తే బాగుంటుందని ముందుగా సిద్ధరామయ్య రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సూచించారు. ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు ప్రైవేటు ఆస్పత్రులు సైతం ముందుగా అవసరమైన చికిత్సను అందజేయాలని, డబ్బు గురించి ఆలోచించరాదని అన్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం విజయవంతంగా అమలు కావాలంటే సాధారణ ప్రజలు, ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు, వైద్యులు, పోలీసులు ఇలా అందరి సహకారం అవసరమన్నారు. ఈ పథకంలో భాగంగా ప్రమాద బాధితులకు 48 గంటల వరకు రూ. 25 వేల ఖర్చును ప్రభుత్వం భరించే దిశగా ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఇప్పటివరకు దేశంలో ఇలాంటి పథకం లేదని చెప్పారు. ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన చేసిన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు ఆయన అభినందనలు తెలియజేశారు. హరీష్ తల్లి గీతా మాట్లాడుతూ....‘నా కుమారుడికి కలిగిన పరిస్థితి మరే బిడ్డకు రాకూడదు. ఈ పథకానికి హరీష్ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది. ప్రమాద బాధితులకు కొత్త ఊపిరి పోయడానికి ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. మంత్రులు యు.టి.ఖాదర్, శరణ్ ప్రకాష్ పాటిల్ పాల్గొన్నారు.
‘హరీష్’ స్ఫూర్తి అజరామరం
Published Wed, Mar 9 2016 2:05 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement